2024 అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్ సీపీ అధినేత జగన్ తన కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే అభ్యర్థులు,ఇంచార్జ్‌ల మార్పుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. మొదటి విడతలో 11 మంది ఇంచార్జ్‌లను మార్పు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అదే తరహాలో రెండో విడత జాబితా ప్రకటించేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అయితే రెండో విడతలో ఎవరెవరికి సీటు దక్కడం లేదన్నదానిపై ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయా ఆయా అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల్లో మార్పులు పూర్తిగా సర్వేలపైనే ఆధారపడ్డారు వైసీపీ బాస్.
ప్రజల్లో అభ్యర్థులకు ఉన్న అనుకూల, ప్రతికూల అంశాలు, పార్టీ స్థానిక నేతలతో ఉన్న సంబంధాలు, అవినీతి ఆరోపణలు, ప్రత్యర్థిని ఢీ కొట్టగల సామర్ధ్యం ఉందా లేదా.. ఇలాంటి అన్ని అంశాలలో సర్వేలు చేయించారు సీఎం జగన్. ఈ సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా సర్వే నివేదికలు సిద్దమైనట్లు తెలిసింది. మొదటి జాబితాలో మార్పులు చేసిన 11 మందితో పాటు మరో నలభై మంది వరకూ సిట్టింగ్‌లు, ఇంచార్జ్‌ల మార్పు ఉండవచ్చని తెలుస్తోంది. దీంతో తమకు సీట్లు ఉంటాయా లేదా అని లెక్కలేసుకునే పనిలో పడ్డారు వైసీపీ ఎమ్మెల్యేలు. తమ రిపోర్ట్ ఎలా ఉంది.? అధిష్టానం నుంచి ఏమైనా ఫోన్ వస్తుందా అనే ఆందోళనలో ఉన్నారు పలువురు నేతలు. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు సీటు ఉండదని వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లు తెలిసింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో కైకలూరు, నూజివీడు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలో ఉన్నాయి. ఇక కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న మొత్తం 14 స్థానాల్లో పలువురు సిట్టింగ్‌లకు అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లినట్లు తెలిసింది. వీరిలో జిల్లా మంత్రి కూడా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. పెడన ఎమ్మెల్యేగా ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌కు కూడా తన స్థానం మార్పు చేస్తున్నట్లు అధిష్టానం స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. జోగి రమేష్‌ను పెడన నుంచి కాకుండా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లా నుంచి రెండు అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్నారు మంత్రి జోగి రమేష్. తనతో పాటు కొడుకు రాజీవ్‌కు కూడా సీటు ఆశిస్తున్నారు. సిట్టింగ్ స్థానం పెడనతో పాటు మైలవరం నియోజకవర్గం కూడా తన కుటుంబానికి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ రెండు కాకుండా విజయవాడ ఎంపీ బరిలో దిగాలని అధిష్టానం పెద్దలు సూచించినట్లు సమాచారం.
ఇక తిరువూరు ఎమ్మెల్యేకి కూడా ఈసారి సీటు లేదని తెలిసింది. వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రక్షణనిధిపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత, నాయకుల్లో కూడా వ్యతిరేకత ఉండటంతో ఆయనకు ఈసారి సీటు లేదని తెలుస్తోంది. ఇక అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్థానంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నారట సీఎం జగన్. ఇక్కడ టీడీపీ-జనసేన పొత్తుతో కాపు సామాజిక వర్గానికి కాకుండా బీసీ సామాజిక వర్గానికి సీటు ఇస్తే గెలుస్తామనే ఉద్దేశంతో పాటు సింహాద్రి రమేష్ పై అంత అనుకూలత లేదని తెలుస్తోంది. ఇక మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం విషయంలో కూడా జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. మరోవైపు కీలకమైన రెండు నియోజకవర్గాలకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మొత్తానికి టీడీపీ కీలకంగా భావిస్తున్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో.. గతంలో మాదిరిగానే ఈసారి అధిక సీట్లు గెలిచేలా వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..