ఏప్రిల్‌లో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు.. ఇప్పటినుంచి స్ట్రాటజీ మొదలుపెట్టింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు.. స్పీకర్ ఆమోద ముద్ర వేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఎట్టకేలకు ఆ రాజీనామాకు ఆమోదం తెలిపారు స్పీకర్. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేశారు.. ఏపీ అసెంబ్లీ కార్యదర్శి.
పార్టీ ఫిరాయించిన మరో 8మంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేశారు..అసెంబ్లీ స్పీకర్. వైసీపీ నుంచి గెలుపొంది టీడీపీకి సన్నిహితంగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేరరెడ్డితో పాటు టీడీపీ నుంచి గెలుపొంది వైసీపీకి అనుబంధంగా ఉన్న కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్, మద్దాలి గిరి, జనసేన నుంచి గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కునోటీసులు జారీ అయ్యాయి. ఈ 8 మంది సభ్యులు వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. వీరినుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని స్పష్టం చేశారు.
ఏపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభకు ఎంపికైన వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, టీడీపీలో గెలిచి బీజేపీలో చేరిన సీఎం రమేష్, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ల పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. ఈ రాజ్యసభ సీట్ల భర్తీకి..త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో నోటిఫికేషన్‌కు ముందే ఫిరాయింపు ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చారు..స్పీకర్..
ఒక్కో రాజ్యసభ ఎంపీ విజయానికి.. 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఏపీ కోటాలో ఖాళీ కానున్న మూడు స్థానాలను దక్కించుకోవాలంటే..132 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం వైసీపీకి అసెంబ్లీలో 151 మంది సభ్యుల బలం ఉంది. అయితే ఇటీవల సీట్ల సర్ధుబాటు కారణంగా పలువురు ఎమ్మెల్యేలు..వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. దీంతో కీలక ఎన్నికలకు ముందు ఆ ఓట్లు టీడీపీకి అనుకూలంగా మారకుండా జాగ్రత్త చర్యలు చేపట్టింది అధికార పార్టీ. అందుకే వారిపై డిస్క్వాలిఫికేషన్అస్త్రాన్ని ప్రయోగించింది. మరి దీనికి ప్రతిపక్ష టీడీపీ ఏవిధమైన కౌంటర్ ఇస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..