Andhra Pradesh: ఒకే ఒక్క ఫోటో.. ఇప్పుడు కర్నూలు జిల్లా పత్తికొండ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఎక్కడ కూర్చున్నా దీనిపైన టాపిక్ నడుస్తోంది. అంతగా ప్రభావితం చేస్తున్న ఆ ఫోటోలో ఎవరు ఉన్నారు? దాని కథేంటి ఇప్పుడు తెలుసుకుందాం.. సంచలనంగా మారిన ఫోటోలో కనిపిస్తున్న నేతలు ఒకరు కేఈ శ్యాంబాబు. మరొకరు రామచంద్రారెడ్డి. ఇద్దరు వేరువేరు పార్టీల నేతలు కావడమే ఈ ఫోటోకి ప్రాధాన్యత.
గత సాధారణ ఎన్నికలలో కర్నూలు జిల్లా పత్తికొండ నుంచి దివంగత నారాయణ రెడ్డి సతీమణి కంగాటి శ్రీదేవి కనివిని ఎరుగని మెజార్టీతో గెలుపొందారు. 40 వేల ఓట్ల మెజారిటీతో గెలవడం.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక టీడీపీ తరఫున మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు శ్యాంబాబు పోటీచేశారు. పత్తికొండ కేంద్రానికి ముఖ్య నాయకుడైన రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు నియోజకవర్గ గెలుపు ఓటములను శాసిస్తారు అనేది బహిరంగ సత్యం. గత ఎన్నికలలో పత్తికొండ పట్టణంలో ఏకపక్ష ఓటింగ్ జరిగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో కూడా ఇదే రిపీట్ అయింది. అలాంటి రామచంద్రారెడ్డి నిన్న శ్యాం బాబు దగ్గర కూర్చుని నవ్వుతూ మాట్లాడుతూ కనిపించడం ఎమ్మెల్యే శ్రీదేవి వర్గంలో అలజడి రేపింది. ఎదురుపడితే పలకరించుకోవడం మామూలే. కానీ పక్క పక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకోవడం ఎమ్మెల్యే వర్గానికి ఏమాత్రం రుచించడం లేదు.
మరోవైపు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎమ్మెల్యే తన అనుచరుల ద్వారా ఆరా తీసారట. ఆయన ఏమైనా పార్టీ మారుతున్నారా అని తెలుసుకున్నారట. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే శ్రీదేవికి, రామచంద్ర రెడ్డి దంపతులకు మధ్య సత్సంబంధాలు లేవు. నియోజకవర్గ కేంద్రమైన పత్తికొండలో తమ మాట చెల్లుబాటు కావడం లేదని, కనీసం పంచాయతీ కార్యాలయంలో తాము సూచించిన వారికి కూడా పోస్టింగ్ కావడం లేదని, ఎమ్మెల్యే పత్తికొండకు వచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా రావడం లేదని వాపోతున్నారు.
రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులకు మంచి రాజకీయ నేపథ్యం ఉంది. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కూతురు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి స్వయానా అక్కనే నాగరత్నమ్మ. పత్తికొండ ఎంపీపీగా పనిచేశారు. రామచంద్రారెడ్డి సెంట్రల్ బ్యాంక్ వైస్ చైర్మన్ గా కూడా పనిచేశారు. ఇంతటి నేపథ్యమున్న తమను పక్కన పెట్టడం పట్ల ఎమ్మెల్యేపై గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే శ్యాం బాబుతో కలవడంపై నియోజకవర్గం అంతట రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు నాయుడు అంటే రామచంద్రారెడ్డి దంపతులకు మంచి గౌరవం ఉండేది. గత ఎన్నికలలో విధిలేని పరిస్థితుల్లో పార్టీ మారాల్సి రావడంతో వైసీపీలో చేరారు. తాజాగా ఎమ్మెల్యే శ్రీదేవితో అంటి ముట్టనట్లు ఉండటం, శ్యాం బాబుతో క్లోజ్ గా ఉండటం కారణంగా రామచంద్రారెడ్డి దంపతులు మళ్లీ టీడీపీలో చేరుతారా అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ రామచంద్రారెడ్డి దంపతులు ఖండించకపోవడం ఈ ప్రచారానికి మరింత బలాన్ని ఇస్తోంది.
Also read:
Telangana: ఢిల్లీలో నా సీటు లాగేసుకున్నారు!.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై చిరంజీవి చమత్కారం..