ఏపీలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఓట్లకు, పోలయిన ఓట్ల శాతానికి తేడా ఉందంటూ వైసీపీ ఆరోపణలు చేసింది. అందులో భాగంగా పలు జిల్లాల్లో ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ చేయగా… టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ విజయం సాధించారు. నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా 34వేల 60 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఒంగోలులో 12 పోలింగ్ బూత్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ.. రీ వెరిఫికేషన్ చేయాలంటూ వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులురెడ్డి 5 లక్షల 66 వేల రూపాయలు చెల్లించారు. దీంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు కలెక్టర్ తమీమ్ అన్సారియా. రీ వెరిఫికేషన్‌లో ఈవీఎంల కంపెనీ ప్రతినిధులు కూడా పాల్గొంటారని అధికారులు చెబుతున్నారు.
ఒంగోలులోని భాగ్యనగర్ గోడౌన్‌లో EVMలను భద్రపరిచారు. అక్కడే ఈ మాక్‌పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరికీ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారి ముందే ఈ మాక్‌పోలింగ్ చేస్తారు. ఒంగోలు నియోజకవర్గంలోని.. 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాల్లో ఉన్న EVMలకు ఇప్పుడు రీవెరిఫికేషన్‌లో భాగంగా మాక్‌పోలింగ్ చేయనున్నారు. రోజుకు 2పోలింగ్ బూత్‌ల చొప్పున 12 సెంటర్లలోని EVMలను పరిశీలిస్తారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతోపాటు సంబంధిత అధికారులు, బెల్ ఇంజినీర్ల సమక్షంలో ఈ ప్రక్రియ జరుగుతుంది.