ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు పోటీ చేయడం అభ్యర్థులను బరిలో నిలపడం సహజం. కానీ అభ్యర్థులను బరిలో నిలిపిన తర్వాత వారి అభ్యర్థిత్వాల విషయంలో సాంకేతికపరమైన సమస్యలు లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా చొరవ తీసుకుంటుంది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగితే, నామినేషన్ల ప్రక్రియ నుంచి బీఫామ్ తీసుకునే వరకు వాటిని సమర్పించడానికి ప్రత్యేకంగా న్యాయవాదులను నేరుగా అభ్యర్థులే నియమిచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం నేరుగా ఆ బాధ్యతను తమ భుజానికి ఎత్తుకుంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25 మంది ఎంపీ అభ్యర్థులకు పార్టీ తరఫున నేరుగా లీగల్ అడ్వైజర్లను నియమించబోతోంది. గత ప్రభుత్వంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వారిపై అలాగే పలు పెండింగ్ కేసులు చాలామంది నేతలపై ఉన్న నేపథ్యంలో వారి నామినేషన్ల స్వీకరణ విషయంలో సమర్పించే అఫిడివిట్లలో ఎటువంటి సాంకేతిక పరమైన ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా పార్టీ చొరవ తీసుకోబోతోంది. అందులో భాగంగా పార్టీ లీగల్ సెల్ తరఫున దాదాపు 175 మందికి నియోజకవర్గాలకు నలుగురు చొప్పున న్యాయవాదులను వైసీపీ నియమించింది.
నామినేషన్లు సమర్పించే క్రమంలో ఏ రకమైన న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికల్లో ముందుకు వెళ్లేలా యాక్షన్ ప్లాన్ రూపొందించింది వైసీపీ. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా ఈ సమస్యకు పరిష్కారం చూపేలాగా వైసీపీ అధిష్టానమే అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే వైసీపీ లీగల్ తో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి భేటీ అయ్యి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది వైసీపీ.
గతంలో ఎమ్మెల్యే అభ్యర్థులు అఫిడవిట్ దాఖలు చేసే క్రమంలో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని వైసీపీ భావిస్తోంది. ఇక ఎన్నికల్లో వారంతా గెలిచిన తరువాత కూడా కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి రావడంతో, ఇటు పార్టీకి సైతం తలనొప్పిగా మారింది. దీంతో వైసీపీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగింది. అటువంటి పరిస్థుతులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగానే నేరుగా వైసీపీ అధి నాయకత్వం లీగల్ సెల్ సమావేశం ఏర్పాటు చేసింది. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థుల నామినేషన్‌లను సమర్పించే వరకు పూర్తిగా పార్టీ అధినాయకత్వం మానిటర్ చేయబోతుంది.
గతంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు కారణంగా పలుచోట్ల వచ్చిన అభ్యంతరాల దృష్ట్యా అటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని వైసీపీ భావిస్తోంది. అందులో భాగంగానే ఒక్కో నియోజకవర్గానికి నలుగురు న్యాయవాదులను ప్రత్యేకంగా అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన ప్రక్రియకు పరిశీలకులుగా నియమించింది. వీరంతా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే పార్టీ నుంచి బీ ఫార్మ్ అభ్యర్థులకు రాగానే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లలో ఆస్తుల వివరాలు, గతంలో అభ్యర్థిపై నమోదు అయినా కేసుల వివరాలు వాటి స్టేటస్, కుటుంబ సభ్యుల వివరాలు, అభ్యర్ధి తన స్థానికత, ఆదాయం, ఆస్తుల వివరాలు, తన వాహనాలు, స్థిర చర ఆస్తులతో పాటు , కులం ధృవీకరణ, మతం, నియోజవర్గంలో పోటీ చేసే స్థానంలో ఓటు హక్కుకు సంబంధించిన అన్ని వివరాలను న్యాయవాదుల సమక్షంలోనే ఫిల్టర్ చేసి ఎన్నికల వరకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.
గతంలో ఎన్నికల్లో అభ్యర్థులు వారి నేరుగా లీగల్ గా నామినేషన్ ప్రక్రియలో భాగం అయినా కూడా ఈసారి వైసీపీ అధినాయకత్వం నేరుగా రంగంలోకి దిగింది. గతంలో వైసీపీలో మడకశిర అభ్యర్ధిగా తిప్పేస్వామి 2014లో పోటీ చేసినా అఫిడవిట్లో వివరాలు తప్పుగా నమోదు చేశారు. వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తిప్పేస్వామి న్యాయ పోరాటం చేసి ఎన్నికలకు సరిగ్గా రెండు నెలల ముందు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక మాజీ హోం మంత్రి సుచరిత సైతం తాను క్రిస్టియన్ అని చెప్పడంతో ఒక్కసారిగా వివాదాల్లోకి ఎక్కారు. ఇక అప్పటి వైసీపీ తాటికొండ ఏమ్మెల్యే , ఇప్పటి రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి సైతం తాను క్రిస్టియన్ అని చెప్పడంతో విచారణకు కమిషన్ ఎదుట హాజరు అవ్వాల్సి వచ్చింది.
ఇక మంత్రి పుష్ప శ్రీ వాణీ సైతం కుల ధృవీకరణ విషయంలో వివాదాల్లోకి ఎక్కారు. ఎమ్మెల్సీ అనంత బాబు సైతం కుల ధృవీకరణ విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రాబోయే ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధి ఎవరైనా కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేరుగా అభ్యర్థుల ఎన్నికల నామినేషన్ ప్రక్రియను మొత్తానికి పరిశీలన చేయబోతుంది. ఇప్పుడు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ అభ్యర్థికి నలుగురు లీగల్ సెల్ సభ్యులతో మానిటర్ చేస్తుండగా వారిలో ఒకరు నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అభ్యర్ధి నామినేషన్ ప్రక్రియలో ఎదురయ్యే వివరాలను నమొదు చేసుకొని వాటిని ఎలా అధిగమించి ముందుకు వెళ్లాలి. ఒకవేళ అభ్యర్ధి నామినేషన్ ముందుకు వెళ్లకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసేలా అడుగులు వేస్తుంది వైసీపీ. ఇక ఎంపీ అభ్యర్థికి 28 లీగల్ సెల్ సభ్యులతో టీమ్ వర్క్ తో నామినేషన్ ప్రక్రియలో సహకారం ఇచ్చేలా వైసీపీ ఇప్పటికే అడుగులు వేస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ ఛేయండి…