YS Jagan: సిండికేట్ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణలు..
ఏపీలో లిక్కర్ షాపుల టెండర్లపై మాజీ సీఎం జగన్ ఘాటు ఆరోపణలు చేశారు. లిక్కర్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందన్నారు. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి సీఎం చంద్రబాబే అంటూ విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైన్ షాపుల టెండర్ల ప్రక్రియపై విపక్షాలు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నాయి. అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్ కాదా? మీ మనుషులతో సిండికేట్ ఏర్పాటుచేసి షాపులను కొట్టేయడం నిజం కాదంటారా? రానున్న ఐదేళ్లలో ఎమ్మార్పీ కంటే అధిక రేట్లతో మద్యం అమ్మి, మీరు అనుమతిచ్చిన డిస్టలరీల ద్వారా అమ్మకాలు భారీ స్థాయిలో పెంచేసి వేలకోట్ల రూపాయల అక్రమ రాబడికి ద్వారాలు తెరిచిన మాట వాస్తవం కాదా.. అంటూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి ఎక్స్‌లో ఘాటు ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి.. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
ఏపీ సర్కార్ తెచ్చిన కొత్త లిక్కర్ పాలసీతో…ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని ఆ పోస్ట్‌లో జగన్ పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టడానికి చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించి, దీనికోసం క్వాలిటీని తగ్గిస్తూ, ఇంకోవైపు అమ్మకాలు విపరీతంగా పెంచేసి, తద్వారా డిస్టలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారన్నారు జగన్. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పని చేసే 15 వేలమంది సిబ్బంది రోడ్డున పడ్డారని, వాళ్ల సంగతేంటని ఆ పోస్ట్‌లో జగన్ ప్రశ్నించారు. ఈ చర్యలను చంద్రబాబు సర్కార్ సరిదిద్దుకోకపోతే… ప్రజల తరఫున ఉద్యమిస్తామంటూ ఆ పోస్ట్‌లో జగన్ పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ ట్వీట్ ..
1.లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిపోయింది. ఈ మాఫియాకు సూత్రధారి, పాత్రధారి మీరు కాదా చంద్రబాబుగారూ? అత్యంత పారదర్శకంగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, వాటిని ప్రయివేటుకు, మీవారికి అప్పగించాలన్న మీ నిర్ణయం అవినీతికోసం వేసిన స్కెచ్ కాదా? మీ…
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 14, 2024
ఇదిలాఉంటే.. ఏపీలో లిక్కర్ షాపుల కేటాయింపు ప్రక్రియ జాతరలా జరిగింది. దరఖాస్తుదారుల సమక్షంలో.. సీసీ కెమెరాల నిఘాలో.. లక్కీ డ్రా తీశారు అధికారులు. షాపుల వారీగా వచ్చిన దరఖాస్తులకు నెంబర్లు కేటాయించి.. అందరి సమక్షంలో లక్కీ డిప్ తీశారు. షాపులు దక్కించుకున్న వారికి అధికారులు లైసెన్స్‌లు ఇచ్చారు. షాపుల దక్కించుకున్న వారిచేత అప్పటికప్పుడే లైసెన్స్ ఫీజును వసూలు చేశారు అధికారులు. అక్కడే క్యాష్ కౌంటింగ్ మెషీన్లతో లెక్కించి.. ఖజానాలో డిపాజిట్ చేశారు. ఈ నెల 16 నుంచి.. అంటే వచ్చే బుధవారం నుంచే ఏపీలో కొత్త లిక్కర్ విధానం అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3వేల 396 మద్యం దుకాణాలకు 89వేల 882 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి 17వందల 97 కోట్ల మేర ఆదాయం సమకూరింది. ఇక లైసెన్స్ ఫీజుల రూపంలోనూ ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..