ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో బహుజనుల సమావేశాలు జోరందుకున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల బీసీ నినాదాలతో ఏపీ మార్మోగుతోంది. అర్థభాగానికి పైగా ఉన్న బీసీ వర్గాల సమీకరణలు.. సన్మానాలతో ఏపీ ప్రతిధ్వనిస్తోంది. విశాఖ తీరంలో అధికార వైసీపీ నేతృత్వంలో బీసీ గర్జన సభ జరిగింది. మరోవైపు కాకినాడ తీరంలో టీడీపీ ఆధ్వర్యంలో శెట్టిబలిజ సాధికారతా సమావేశం నిర్వహించింది. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఇటు ప్రతిపక్షం అటు అధికారం పక్షం రెండూ బీసీల సమీకరణలో తలమునకలౌతున్నాయి.
విశాఖలో వైసీపీ నేతృత్వంలో బీసీ గర్జన సభను ఘనంగా నిర్వహించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే మరే రాష్ట్రంలోనూ లేవన్నారు విశాఖ వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలకు జగన్ ప్రభుత్వం న్యాయం చేస్తోందన్నారు వైవీ సుబ్బారెడ్డి. బీసీలు ఎవరిమీదో ఆధారపడటం కాదు.. తమకాళ్ళపై తాము నిలబడి రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థానానికి ఎదిగేలా చేస్తున్న ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. బీసీలకు ఉన్నత పదవుల్లో పెద్దపీట వేస్తున్నారని తెలిపారు వైవీ సుబ్బారెడ్డి.
ఈ సభకు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ , ఎంపీ ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు హాజరయ్యారు. బీసీ నేతలు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీ ఆర్ కృష్ణయ్యలను ఘనంగా సన్మానించారు. చంద్రబాబు పాలనలో ఏపీలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. అప్పట్లో వైఎస్, ఇప్పుడు జగన్ పాలనలోనే బీసీలకు న్యాయం జరుగుతోందన్నారు. బీసీల అభ్యున్నతికి జగన్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.
ఇక, అంబెడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో తెలుగుదేశం పార్టీ శెట్టిబలిజ సాధికారత సమావేశం జరిగింది. సమావేశానికి భారీగా హాజరయ్యారు శెట్టిబలిజ సామాజికవర్గం నేతలు, మహిళలు. టీడీపీ కి అండగా ఉండేది బీసీలేనన్నారు మాజీ ఎమ్మెల్యే ఆనందరావు. వైసీపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెట్టరని ఆరోపించారు. ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మెల్యే దగ్గరకు మీరు రావడం కాదు… ఎమ్మెల్యే నే మీదగ్గరుకు వస్తారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అమలాపురం లో 5 కోట్లతో బీసీ కల్యాణ మండపం నిర్మిస్తామన్నారు శాసన మండలి డిప్యూటీ మాజీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం.. అమలాపురం అల్లర్లు కేసులు ఎత్తివేతకు జీవో తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..