తెనాలిలో దారుణం..! బావమరిది సుపారీ స్కెచ్.. బావను మాట్లాడాలని తీసుకెళ్లి..!
గుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్, హత్య ఘటన కలకలం రేపింది. చెక్కపాలిష్ వ్యాపారి కోటి లింగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కుటుంబ ఆస్తి వివాదాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుంటూరు జిల్లా తెనాలిలో కిడ్నాప్, హత్య ఘటన కలకలం రేపింది. చెక్కపాలిష్ వ్యాపారి కోటి లింగయ్యను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి.. దారుణంగా హతమార్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనకు కుటుంబ ఆస్తి వివాదాలే కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోటి లింగయ్య కొంతకాలంగా తెనాలిలో చెక్కపాలిష్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. గతంలో విజయవాడలో నివసించిన సమయంలో దీప్తి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం తర్వాత ఇద్దరూ సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం కోటి లింగయ్య కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇంట్లో విభేదాలు తలెత్తాయి. దీంతో దీప్తిని వెంటబెట్టుకుని తెనాలికి వచ్చి నివాసం ఉంటున్నాడు.
మరోవైపు కోటి లింగయ్య భార్య ప్రస్తుతం విజయవాడలో తన తమ్ముడు రాజేష్ ఇంట్లో పిల్లలతో కలిసి ఉంటున్నారు. విజయవాడలో తనకు ఉన్న ఆస్తిని విక్రయించి తెనాలిలో వ్యాపారం కొనసాగించాలని కోటి లింగయ్య భావించినట్లు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆస్తిని మొత్తం పాడు చేస్తున్నాడన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈ నేపథ్యంలో కోటి లింగయ్యను కిడ్నాప్ చేసి భయపెట్టాలని అతని బావమరిది రాజేష్ నిర్ణయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇందుకోసం భట్టిప్రోలు మండలం ఓలేరుకు చెందిన నలుగురితో సుపారీ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. ఆగస్టు నెల 29వ తేదీన నంబర్ ప్లేట్ లేని తెల్ల కారులో వచ్చిన సుపారీ గ్యాంగ్.. తెనాలి సమీపంలోని సోమసుందరపాలెం వద్ద కోటి లింగయ్యను అడ్డగించి బలవంతంగా కారులో ఎక్కించుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోటి లింగయ్య కనిపించడం లేదని అతనితో సహజీవనం చేస్తున్న దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కిడ్నాప్ చేసిన అనంతరం కోటి లింగయ్యను ఓలేరు వైపు తీసుకెళ్తుండగా కారులోనే అతనిపై దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన కోటి లింగయ్య మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో కోటి లింగయ్య బావమరిది రాజేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌కు ఉపయోగించిన వాహనం, సుపారీ గ్యాంగ్ సభ్యుల పాత్ర, హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు విచారిస్తున్నారు.
అయితే కోటి లింగయ్య మృతదేహం ఇంకా లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో మృతదేహం కోసం పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహం లభించిన తర్వాతే మరణానికి సంబంధించిన పూర్తి కారణాలు, దాడి తీవ్రత, ఘటన జరిగిన ప్రదేశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఆస్తి వివాదమే కిడ్నాప్, హత్యకు ప్రధాన కారణమా? లేక ఈ వ్యవహారం వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల విచారణ, మృతదేహం లభ్యం, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా ఈ సంచలన కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
