Women’s Day 2022: తగ్గేదే లే అంటున్న ఆటో అతివలు.. ఆటో డ్రైవర్ వృత్తితో బతుకు బండి నడుపుతున్న నారీమణులు..

|

Mar 08, 2022 | 11:05 AM

International Women's Day 2022: కాలంతో పరుగులు తీసే అతివలు వాళ్లు. ఎందుకంటే వాళ్లు ఎంచుకున్న వృత్తి అలాంటిది మరి. పోటీ ప్రపంచంలో బతకాలి.. అది ఏ పనైతే ఏంటీ అనుకున్నారు.

Womens Day 2022: తగ్గేదే లే అంటున్న ఆటో అతివలు.. ఆటో డ్రైవర్ వృత్తితో బతుకు బండి నడుపుతున్న నారీమణులు..
Woman Auto Driver
Follow us on

International Women’s Day 2022: కాలంతో పరుగులు తీసే అతివలు వాళ్లు. ఎందుకంటే వాళ్లు ఎంచుకున్న వృత్తి అలాంటిది మరి.. పోటీ ప్రపంచంలో బతకాలి.. అది ఏ పనైతే ఏంటీ అనుకున్నారు. ఆటోమొబైల్‌ రంగంలో మగవాళ్లు రాణించడమే చాలా కష్టం. అలాంటి రంగంలోని వృత్తినే ఎన్నుకున్న తిరుపతి మహిళలు.. విల్‌ పవర్‌తో అన్ని సమస్యలను అధిగమిస్తున్నారు. నమ్ముకున్న వృత్తిలో మగాళ్లకు ధీటుగా రాణిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. రద్దీ రోడ్లపై డ్రైవింగ్‌ అంటే ఛాలెంజింగ్‌తో కూడుకున్న వృత్తి. అలాంటి వృత్తిలో రాణిస్తూ.. తమకు తిరుగులేదని చాటుకుంటున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఇతర వనతామూర్తుల్లో స్ఫూర్తిని నింపుతున్న వీరి స్టోరీని చదవండి..

ఆధ్మాత్మిక నగరంలో ఆటో అతివల జోరు కొనసాగుతోంది. కష్టకాలంలో కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు. ఇంటి బాధ్యతలతో ఆటోడ్రైవర్లుగా మారారు ఈ మహిళామణులు. పోటీ ప్రపంచంలో ఆటోడ్రైవర్లుగా రాణిస్తున్నారు. ఆత్మవిశ్వాసంతో స్టీరింగ్‌ చేతపట్టి బతుకుబండికి భరోసా ఇస్తున్నారు. రూల్స్‌ పాటించడమే కాదు.. సేఫ్‌ జర్నీకి కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

ఆటోలను ఎక్కువగా మగవాళ్లే నడుపుతుంటారు. అలాంటి రంగంలో ఇప్పుడిప్పుడే ఆడవాళ్లు రాణిస్తున్నారు. వాహనరంగంలోనే కాదు.. ఏ రంగంలో అయినా తాము తీసిపోమంటున్నారు. ఒంటిపై ఖాకీ యూనిఫాం.. చేతిలో ఆటో స్టీరింగ్‌ పట్టడానికి … కుటుంబ బాధ్యతలే కారణం. ఇంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే.. ఆటో నడపడం పెద్దకష్టమేమీ కాదంటున్నారు ఆటోడ్రైవర్‌ నాగలక్ష్మి.
ఆటోడ్రైవర్లుగా సేఫ్‌ జర్నీకి భరోసా ఇస్తున్నారు. మగవాళ్లే కాదు.. ఆడవాళ్లు కూడా వీరి ఆటోల్లోనే వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతూ.. ప్రయాణికుల మనసులను దోచుకుంటున్నారు.

Women Auto Drivers

అయితే వీరందరినీ ఈ వృత్తివైపు మళ్లించడానికి కారణం.. రాస్‌ పొదుపు మహిళా సంఘం. ఏ ఆధారం లేని మహిళలను చేరదీసి వారికి ఉపాధి కల్పిస్తోంది ఈ సంస్థ. డ్రైవింగ్‌లో శిక్షణను ఇవ్వడమే కాదు.. ష్యూరిటీగా ఉంటూ బ్యాంకులోన్ల ద్వారా ఆటోలను సమకూర్చుతోంది. ఆ సంస్థ సాయంతో తమ కాళ్లపై తాము నిలబడగలిగినట్లు ఆటో డ్రైవర్ మహాదేవి తెలిపింది.

ఈ వృత్తిలోకి వచ్చిన వారిలో.. బాగా చదువుకున్న వాళ్లు కూడా ఉన్నారు. క్రైసిస్‌ కాలంలో ఉద్యోగాలను పోయినప్పుడు ఈ వృత్తినే ఆధారంగా ఎంచుకున్నారు. అందుకు ఉదాహరణే.. ఇదిగో ఈ కుమారి లక్ష్మి. ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ చదివిన కుమారి మొదట్లో ప్రైవేట్‌ ఉద్యోగం చేసేది. భర్త కూడా ఆటోడ్రైవరే కావడంతో.. అతనికి తోడుగా ఆమె కూడా ఇదే వృత్తిని ఉపాధిగా మల్చుకుని కుటుంబానికి ఆసరాగా ఉంటూ వస్తోంది ఆటో డ్రైవర్‌గా రాణిస్తున్న కుమారి లక్ష్మి.

ఇలా ఒక్కరని కాదు.. ఒక్కొక్కరిదీ ఒక్కో కుటుంబగాధ. ఇంటిని చక్కబెట్టుకోవడం, అదే సమయంలో ఆటోనడుపుతూ జీవనోపాధి పొందుతూ.. సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నారు. ఆటోలు నడిపే మగవాళ్ల నుంచి చీత్కారాలు, చీదరింపులు ఎదురవుతున్నా.. నమ్ముకున్న వృత్తినే దైవంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. ఎంతో ధైర్యంగా రోడ్లపై ఆటోలను నడుపుతూ.. కుటుంబపోషణలో భాగమవుతున్నారు వీరంతా. తమ జీవితాలకు తామే రోల్‌ మోడల్స్‌ అని నిరూపించుకుంటూ అందరి మన్ననలు పొందుతున్నారు.

– రాజు, తిరుపతి, టీవీ9 తెలుగు

Also Read..

Women’s Day 2022: ఈ 4 పోషకాలు మహిళలకు జీవితాంతం కావాల్సిందే.. అవి ఏమిటి.. ఏ ఆహారపదార్ధాలో లభిస్తాయంటే..

International Women’s Day: పీటీ ఉష నుంచి మిథాలీ వరకు.. దేశానికి గర్వకారణంగా నిలిచిన భారత క్రీడాకారిణులు