రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళకు ఓ బ్యాగ్ కనిపించింది. ఎంటాని తెరచి చూడగా.. లోపల కనిపించిన దృశ్యం ఆమెను కలవరపెట్టింది. వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గరిలోని పోలీస్ స్టేషన్ కు బ్యాగ్ తో సహా పరుగులు తీసింది. ఇంతకీ బ్యాగ్ లోపల ఏముందాని అనుకుంటున్నారా?

రోడ్డుపై దొరికిన బ్యాగ్ తెరిచి చూసిన మహిళ షాక్.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు పరుగులు!
Honest Woman Returns Gold Bag

Updated on: Jul 20, 2026 | 1:17 PM

అనకాపల్లి, జులై 20: ఉచితంగా వచ్చేది పినాయిల్‌ అయినా గుటుక్కుమనిపించే.. నేటి కాలంలో ఓ మహిళ చూపిన నిజాయతీ అందరి ప్రశంసలు అందుకుంటోంది. రోడ్డుపై ఎవరో పొరబాటున చేజార్చుకున్న బంగారం, డబ్బు ఉన్న బ్యాగును చూసి దుర్భుద్దితో ఆమె దాచేయలేదు. వెంటనే పోలీసులకు అప్పగించి దానిని పోగొట్టుకున్న యజమానికి చేరేలా చేసింది. ఈ అరుదైన ఘటన అనకాపల్లి జిల్లా తునిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం శరభవరం గ్రామానికి చెందిన గోరంట్ల దేవి తన వద్ద ఉన్న పాత బంగారు ఆభరణాలను ఇచ్చి కొత్త నగలు కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఇంట్లో ఉన్న పాత బంగారు నగలు, నగదును ఒక బ్యాగులో సర్దుకుని శుక్రవారం ఉదయం తునికి బయల్దేరింది. తుని మెయిన్ రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె వద్ద ఉన్న బ్యాగు అనుకోకుండా చేజారి పోయింది. కొంతసేపటి తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో గోరంట్ల దేవి తీవ్ర ఆందోళనకు గురైంది. బంగారం, నగదు ఉన్న బ్యాగు ఎక్కడ పోయిందో తెలుసుకునేందుకు వచ్చిన మార్గం మొత్తం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఇదే సమయంలో రోడ్డుపై పడి ఉన్న ఆ బ్యాగును ఏడేలమ్మ అనే మహిళ కంట పడింది. బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు ఆభరణాలు, నగదు ఉన్నట్లు గుర్తించింది. అయితే వాటిని యజమానికి చేరేలా చేయాలని భావించిన ఏడేలమ్మ.. వెంటనే బ్యాగుతో సహా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.

ఇవి కూడా చదవండి

పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ విజయబాబుకు బ్యాగును అప్పగించి జరిగిన విషయం వివరించింది. అనంతరం పోలీసులు విచారణ చేపట్టి బ్యాగు యజమాని గోరంట్ల దేవిగా గుర్తించారు. శనివారం ఉదయం ఆమెకు సమాచారం అందించి పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన గోరంట్ల దేవికి బంగారం, నగదు ఉన్న బ్యాగును పోలీసులు అప్పగించారు. పోయాయని భావించిన విలువైన ఆభరణాలు, నగదు తిరిగి దక్కడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. తనకు సహాయం చేసిన ఏడేలమ్మకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది. నిజాయతీగా వ్యవహరించి విలువైన వస్తువులను యజమానికి అందించిన ఏడేలమ్మను పోలీసులు ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ఆమె చూపిన నిజాయతీ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని ప్రశంసలు కురిపించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us