Tirumala Temple: నయన్ దంపతులపై చర్యలు తప్పవు.. స్పష్టం చేసిన టీటీడీ అధికారులు..!
Tirumala Temple: పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న నయన్ దంపతులు లేని చిక్కులు కొనితెచ్చుకున్నారు.
Tirumala Temple: పెళ్లి వేడుకతో సంతోషంగా ఉన్న నయన్ దంపతులు లేని చిక్కులు కొనితెచ్చుకున్నారు. పెళ్లి తరువాత తొలిసారి తిరుమల క్షేత్రాన్ని దర్శించిన ఈ నవ దంపతులు.. ఆదిలోనే వివాదాలపాలయ్యారు. చెప్పులు ధరించి శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో నడవడం రచ్చకు కారణమైంది. అయితే, ఈ వివాదంపై టీటీడీ వీజీఓ బాల్ రెడ్డి స్పందించారు. పవిత్రమైన శ్రీవారి ఆలయ మాడ వీధుల్లోకి హీరోయిన్ నయనతార చెప్పులు ధరించి రావడం దురదృష్టకరం అన్నారు. నయన్ దంపతులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆలయం ముందు ప్రత్యేక ఫోటో షూట్ చేయడం నిబంధనలకు విరుద్ధం అని పేర్కొన్న ఆయన.. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఆమెపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫోటో షూట్ జరిగిన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బందిపైనా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బాల్ రెడ్డి చెప్పారు. నయనతార చెప్పులు ధరించి రావడంలో శ్రీవారి సేవకుల వైఫల్యం కూడా ఉందని, వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని టీటీడీ వీజీఓ బాల్ రెడ్డి తెలిపారు.