
ఏపీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నుంచి సాధారణ రేషన్ కార్డుల స్థానంలో ఆధార్ తరహాలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ డీలర్ల ద్వారా వీటి పంపిణీ ప్రక్రియ చేపట్టారు. అయితే నెలలు గడుస్తున్నా వేల సంఖ్యలో కార్డులు యజమానుల కోసం కార్యాలయాల్లోనే ఎదురుచూస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల మందికి పైగా రేషన్ లబ్ధిదారులు ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 6,68,944 మంది కార్డుదారులలో.. 6,19,856 మంది కార్డులు తీసుకోగా ఇంకా 49,098 మంది ముందుకు రాలేదు. నంద్యాల జిల్లాలో మొత్తం 5,32,570 మందిలో.. 4,96,676 మంది కార్డులు పొందగా, ఇంకా 35,894 మంది కార్డులు తీసుకోవాల్సి ఉంది. మొత్తంగా రెండు జిల్లాల్లో కలిపి సుమారు 85,000 మంది లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టారు.
రికార్డుల ప్రకారం వీరందరికీ కార్డులు మంజూరయ్యాయి. కానీ డీలర్ల దగ్గరకు గానీ, సచివాలయాలకు గానీ వీరు రాకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరంతా వేరే ప్రాంతాలకు వలస వెళ్లారా, ఇవన్నీ బోగస్ కార్డులా? అందుకే బయటకు రావడానికి భయపడుతున్నారా?, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న విషయం తెలియక రావడం లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్డులు పంపిణీ కాకపోవడం వల్ల ప్రభుత్వం రేషన్ కోటా ఆదా అవుతోంది. ఒకవేళ వీరు నిజమైన లబ్ధిదారులే అయి ఉండి, సమాచారం లేక కార్డులు తీసుకోకపోతే వారు తమకు అందాల్సిన ఉచిత రేషన్‌ను కోల్పోయి నష్టపోతున్నారు. ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ అధికారులు స్పందించి, ఈ 85 వేల కార్డుల గురించి గ్రామ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే నిజమైన లబ్ధిదారులు ఎవరో, బోగస్ కార్డులు ఎన్నో తేలిపోతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.