
ఆమెది గుంటూరు.. బ్రాడీపేటలో నివాసం ఉంటుంది. తొమ్మిది నెలల క్రితం ఆమెకు వాట్సాప్‌లో మార్క్ హార్వే అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను అమెరికాలో ఉంటానని ఆమెకు చెప్పాడు. అప్పటి నుండి అడపా దడపా వాట్సాప్ కాల్‌లో మాట్లాడుతుండేవాడు. ఈ పరిచయం కొనసాగుతుండగానే ఒక రోజు.. ఢిల్లిలోని కొరియర్ కార్యాలయం నుండి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ పేరు మీద పార్శిల్ వచ్చిందని అందులో ల్యాప్‌ట్యాప్, సెల్‌ఫోన్ ఉన్నాయని పార్శిల్ కార్యాలయం సిబ్బంది చెప్పారు. దీంతో ఆమె ఉబ్బితబ్బిబ్బైపోయింది. తనకు మార్క్ హార్వే వాటిని పంపించాడని సంతోషపడింది. అయితే వెంటనే ఫోన్‌లోని పార్శిల్ సిబ్బంది ఎక్సైజ్ సుంకం 25 వేల రూపాయలు కట్టాలని చెప్పారు. ఆమె వెంటనే గూగుల్ పే ద్వారా ఆ మొత్తాన్ని వారికి పంపింది.
ఇది జరిగిన గంట తర్వాత కొరియర్ నుండి మరోసారి కాల్ వచ్చింది. కొరియర్‌లో రెండు బంగారు గొలుసులు వచ్చాయని వాటికి ట్యాక్స్ కింది 70 వేల రూపాయలు చెల్లించాలని సిబ్బంది ఫోన్‌లోనే చెప్పారు. ఆమె ఆ మొత్తాన్ని కూడా వారికి పంపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరోసారి ఫోన్ వచ్చింది. ఈ సారి డబ్బు కట్టలు వచ్చాయని వాటికి పన్ను కట్టాలని చెప్పడంతో అనుమానం వచ్చిన ఆమె మార్క్ హార్వేకి ఫోన్ చేసింది.
మార్క్ హార్వే తనదైన శైలిలో ఆమెకు సమాధానం చెప్పాడు. ఆమెను ఆశ్చర్యపరచాలనే ఉద్దేశంతో డబ్బుల కట్టలు పంపానన్నాడు. అయితే అప్పటికే లక్ష రూపాయల వరకూ పన్నుల రూపంలో డబ్బులు కట్టిన ఆమె ఇక తనవద్ద డబ్బులు లేవని డబ్బుల కట్టలు వెనక్కి తెప్పించుకొని తాను కట్టిన నగదు వాపసు చేయాలని కోరింది. వీరిద్దరి మధ్య ఈ మాటలు కొనసాతుండగానే మరోసారి మార్క్ హార్వే నుండి ఫోన్ వచ్చింది. తాను త్వరలోనే ఇండియా వస్తున్నానని తనకు బ్యాంక్ ఖాతా కావాలని ఆమె పేరుతో ఒక ఖాతా ఓపెన్ చేసి వివరాలు పంపించమని చెప్పటం జరిగింది. ఆమె ఒక ఖాతా ఓపెన్ చేసి వివరాలు పంపింది. అయితే ఇంకో అకౌంట్ కూడా కావాలని ఆమెను బ్రతిమాలడటంతో రెండో అకౌంట్ కూడా ఓపెన్ చేసి వివరాలు పంపింది.
ఆ తర్వాత మార్క్ హార్వే నుండి ఫోన్స్ రావడం తగ్గిపోవడంతో అనుమానం వచ్చిన ఆమె బ్యాంకులకు వెళ్లి వివరాలు తీసుకుంది. రెండు అకౌంట్స్ ద్వారా 12 లక్షల మేర లావాదేవీలు జరిగినట్లు ఆమె గుర్తించింది. అయితే తన చేత ఉద్దేశపూర్వకంగానే అకౌంట్స్ ఓపెన్ చేయించి వాటి ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని గుంటూరు పోలీసులకు స్పందనలో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుపై స్పందించిన నేర విభాగం ఏఎస్పీ శ్రీనివాసరావు వెంటనే విచారణ జరపాలని సైబర్ సిబ్బందిని ఆదేశించారు. అయితే దర్యాప్తు పూర్తయిన తర్వాత మాత్రమే అసలు నిజం బయటకు వచ్చే అవకాశం ఉంది.