పశ్చిమగోదావరి, డిసెంబర్ 27: పశ్చిమగోదావరి జిల్లా యండగండి గ్రామంలో పార్శిల్‌లో మృతదేహం కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. వదిన తులసిని బెదిరించి, ఆమె ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ, అతడి రెండో భార్య అయిన తులసి చెల్లెలు రేవతి, ప్రియురాలు సుష్మతో వేసిన స్కెచ్‌లో ఓ అమాయకుడి ప్రాణాలను బలితీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో ఉన్న వదిన తులసి ఇంటికి శవాన్ని పార్శిల్ చేయడం ద్వారా ఆమెను భయపెట్టాలని చూశాడు. అసలు ఈ కుట్రకు జులైలోనే బీజం పడింది. ఎక్కడైనా శవం దొరుకుతుందేమోనని చూశాడు. కానీ ఎక్కడా దొరక్కపోవడంతో ఒంటిరిగా ఉంటున్న పర్లయ్యపై అతడి కన్ను పడింది. ఈ క్రమంలో అతడికి మధ్యం తాగించి కారులో ఊరి బయటకు తీసుకెల్లి, నైలాన్ తాడు మెడకు బిగించి డిసెంబర్ 17న హత్య చేసి, 19 వరకు మృతదేహాన్ని దాచాడు. తొలుత ఓ సామాజిక సేవా సంస్థ ద్వారా తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన సామగ్రిని అందించి, ఆ తర్వాత ఆమె ఇంటికి ప్రియురాలు సుష్మ ద్వారా ఆటోలో చెక్క పెట్టెలో పర్లయ్య శవం ఉంచి, ఆమె ఇంటికి పార్శిల్ పంపించాడు.
నిజానికి, శ్రీధర్ వర్మకు గతంలోనూ నేర చరిత్ర ఉంది. ఇతడికి మూడు పేర్లు, ఇద్దరు భార్యలు, ఓ ప్రియురాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. శ్రీధర్ వర్మ రెండో భార్య రేవతి అక్క అయిన సాగి తులసి ఆస్తి కోసమే పర్లయ్యను హత్య చేసి డెడ్‌బాడీని పార్శిల్‌లో పంపించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తీరా శవం ఇంటికి వచ్చాక తులసి భయపడటంతో.. శవం విషయం బయటకు పొక్కకుండా ఉండాలంటే ఆమె ఆస్తి మొత్తం తనపేరిట రాయాలని ఒత్తిడి తెచ్చాడు. అయితే ఆమె తెలివిగా బాత్రూమ్‌కి వెళ్లి, అక్కడ సెల్ ఫోన్ ద్వారా బంధువులకు మెసేజ్ పంపింది. బంధువులు అక్కడి చేరుకుని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఇప్పటికే శ్రీధర్ వర్మను అరెస్ట్ చేసిన పోలీసులు.. కృష్ణా జిల్లా మల్లంపూడిలో శ్రీధర్ వర్మ తల్లిదండ్రులను, ఆయన ముగ్గురు భార్యలు, పిల్లలు, యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, అతడి భార్య హైమావతి, సాగి తులసిలను పోలీసులు వేర్వేరుగా పలు ప్రదేశాల్లో విచారిస్తున్నారు. ఒకట్రెండ్రోజుల్లో పూర్తి వివరాలు పూర్తిగా వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు. మరోవైపు అమాయకుడైన బర్రె పర్లయ్యను దారుణంగా హత్య చేయడాన్ని ఆయన కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. అమాయకుడిని అన్యాయంగా చంపేశారని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రియురాలు సుష్మ ఇంట్లో మరో చెక్క పెట్టెను గుర్తించిన పోలీసులు.. శ్రీధర్ వర్మ దానిని ఎందుకు తీసుకువచ్చాడనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అసలు ఒకరిని హత్య చేయాలని భావించిన శ్రీధర్ వర్మ.. రెండు శవ పేటికలను ఎందుకు తయారు చేయించాడు? శ్రీధర్ వర్మ టార్గెట్ మరొకరు ఉన్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది.