మే వచ్చేసింది.. మాడు పగిలిపోతోంది.. బయటికెళ్తే ఎండ వేడితో నెత్తి చుర్రుమంటోంది. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయ్. అప్పుడే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక.. భానుడి భగభగలతో ఏపీ, తెలంగాణలోని పలుప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారుతున్నాయి. గత పదేళ్లలో ఎప్పుడూ నమోదు కానంత స్థాయిలో ఎండలు కాస్తుండడంతో కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. కొన్ని జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయటికి రావాలంటనే బయపడుతున్నారు. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఇది చాలదన్నట్లు.. మరో మూడు రోజులు ఎండలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రధానంగా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హెచ్చరిస్తోంది. అటు.. ఏపీ కూడా నిప్పుల కొలిమిని తలపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, SPSR నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
పెరిగిన ఉష్ణోగ్రతలు, వేడి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దాంతో.. 11 నుండి 4 గంటల వరకు ఇంట్లోంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది. పల్నాడు జిల్లా కొప్పునూరు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. చాలా చోట్ల 45 డిగ్రీలపైనే టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఇక.. రాయలసీమ, కోస్తాంధ్రలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే.. ఈ వేడి వాతావరణానికి కాలుష్యం, తత్ఫలితంగా జరుగుతున్న వాతావరణ మార్పులే కారణమని చెప్తున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..