
ఓ నిందితుడికి విజయనగరం ఫోక్సో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు అక్షరాల 23 ఏళ్ల ఆరు నెలల జైలు శిక్షతో పాటు పదకొండు వేల జరిమానా విధించింది న్యాయస్థానం. ఓ చిన్నారి పై జరిగిన అత్యాచార ఘటనలో ఈ తీర్పు వెలువరించింది. 2019 జూన్ నెలలో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పాతపెంటలో ఓ అమానుష ఘటన జరిగింది. 2019లో నాలుగేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన గిరిడ లక్ష్మణరావు అనే యువకుడు మాయమాటలు చెప్పి చాక్లెట్స్ ఆశజూపి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి ప్రతి రోజు అంగన్ వాడీ స్కూల్‌కి వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలోనే గిరిడ లక్ష్మణరావు అనే యువకుడు ఆ చిన్నారికి మాయమాటలు చెప్పి నమ్మకంగా మాట్లాడుతూ దగ్గరయ్యాడు. ఎప్పటిలాగే ఓ రోజు స్కూల్ నుండి వస్తున్న చిన్నారికి చాక్లెట్స్ ఇస్తానని ఆశజూపి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ కొంతసేపు నమ్మకంగా మాట్లాడి అనంతరం చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
తరువాత అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన చిన్నారి పరిస్థితి గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వైద్యులు చిన్నారికి వైద్య పరీక్షలు జరిపి అత్యాచారం జరిగినట్టు ధృవీకరించారు. వైద్యుల సమాచారంతో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులకు పిర్యాదు చేశారు తల్లిదండ్రులు. వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో చిన్నారిపై గిరిడ లక్ష్మణరావు అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు.
ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. బాలల హక్కుల సంఘాలు సైతం ఆందోళనకు దిగాయి. పలువురు నిరసనలు చేపట్టారు. పోలీసులు కూడా వెంటనే స్పందించి నిందితుడు లక్ష్మణరావును అరెస్ట్ చేసి కోర్టులో అభియోగపత్రం సమర్పించారు. 2019 నుండి ఇప్పటి వరకు సుమారు మూడేళ్లపాటు విచారణ కొనసాగింది. పోలీసులు అన్ని ఆధారాలు న్యాయస్థానంకి సమర్పించడంతో నిందితుడు గిరిడ లక్ష్మణరావు నేరం చేసినట్లు నిర్ధారించి సంచలనాత్మక తీర్పు వెల్లడించారు న్యాయమూర్తి.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో చిన్నారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారుల పై కొనసాగుతున్న దాడుల పై అధికారులు స్పందించిన తీరును ప్రశంసిస్తున్నారు. కోర్టు విచారణలో స్పెషల్ ప్రాసిక్యూటర్ మామిడి శంకరరావు సైతం బలమైన వాదనలు వినిపించారు. వచ్చిన తీర్పు నేపధ్యంలో చిన్నారుల పై అఘాయిత్యాలకు పాల్పడితే ఎలాంటి శిక్షలు ఉంటాయో ప్రతి ఒక్కరికీ తెలిసేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..