
విశాఖ ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో రకరకాల వన్యప్రాణులు, పక్షులు సందర్శకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ జూ ను సందర్శించేందుకు జంతు ప్రేమికులు క్యూ కడుతారు. విశాఖ వచ్చే టూరిస్టులు కూడా.. పర్యాటక ప్రదేశాలతో పాటు కచ్చితంగా తమ షెడ్యూల్లో జూ ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే.. వన్యప్రాణులన్నీ ఒకే చోట ఉండడం, తీర ప్రాంతం పక్కనే ఆళ్లదకరమైన వాతావరణంలో ఈ జంతుప్రదర్శనశాల ఉంది. ఇదిలా ఉంటే.. జూ అధికారులు, సందర్శకులు విద్యార్థులు ఒక్కచోట చేరారు. అందరూ క్లాప్స్ కొట్టారు.. కేక్ కట్ చేశారు. సంబరాలు చేసుకున్నారు. హ్యాపీ బర్త్ డే సాంగ్ కూడా పాడారు. ఎందుకో తెలుసా..? జూనియర్ దళపతి పుట్టినరోజు కాబట్టి. ఆ జూనియర్ దళతి ఎవరో కాదు.. అందరినీ తన వైపు ఆకట్టుకునే నీటి ఏనుగు. అదేనండి. హిప్పో పోటమస్..
జూనియర్ దళపతిగా అందరిని ఆకర్షిస్తున్న నీటి ఏనుగుకు గ్రాండ్ గా బర్త్ డే వేడుకలు చేశారు. ఎనిమిదేళ్ల దళపతి ఉన్న ఎంక్లోజర్ దగ్గరకు వెళ్లి.. అందరూ సెలబ్రేషన్స్ చేశారు. జూ క్యూరేటర్ మంగమ్మ.. కేక్ కట్ చేసి పాఠశాల విద్యార్థుల మధ్య వేడుక నిర్వహించారు. అందరూ ఒకరికొకరు కేకును తినిపించుకున్నారు. హ్యాపీ బర్త్ డే జూనియర్ దళపతి అంటూ హిప్పోకు విషెస్ చెప్పారు. బర్త్ డే వేళ హిప్పోకు మాత్రం పుచ్చకాయలు తినిపించారు. వీటిని చూసిన జూనియర్ దళపతి.. ఆసక్తిగా నోరు తెరిచి దాన్ని అందుకుంది. వెజిటేబుల్స్ కూడా తినిపించి గ్రాండ్‌గా ట్రీట్ ఇచ్చారు సందర్శకులు. జూకు వచ్చే ప్రతి ఒక్కరిని జూనియర్ దళపతి అలరిస్తూ ఉంటుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుంది. పుచ్చకాయ అంటే చాలా ఇష్టమని అంటున్నారు యానిమల్ కీపర్స్. ఎక్కువ సమయం నీటిలోనే ఉంటూ.. పర్యాటకులు వచ్చినప్పుడు సరదాగా పైకి వచ్చి కనువిందు చేస్తుందట.