Andhra Pradesh: ఏపీ ప్రజలకు అలెర్ట్.. పొంచి ఉన్న చిత్రాంగ్ తుపాన్ ముప్పు .. మరో మూడు రోజుల పాటు వానలే వానలు
వరద బీభత్సం కొనసాగుతుండగానే విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. తుఫాన్ రూపంలో మరో మూడ్రోజులపాటు భారీవర్షాలు తప్పవన్న హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఎడతెగని వర్షం, వరదలతో అల్లాడుతున్న ఏపీకి.. మరో ముప్పు పొంచి ఉందా? తుఫాన్ రూపంలో మరింత వరద బీభత్సం తప్పదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వానాకాలం దాటినా.. వర్షాలు మాత్రం తగ్గకపోగా మరింత బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కురుస్తున్న భారీవర్షాలకు ఏపీలోని పలు జిల్లాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో రహదారులు, వంతెనలు నీటమునిగాయి. కొన్ని ప్రాంతాల్లో నడవడానికి కూడా వీల్లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు దాటలేక.. పాలు, కూరగాయలు కూడా తెచ్చుకోలేక ఇక్కట్లు పడుతున్నారు. సత్యసాయి జిల్లాలో పాఠశాలలోకి మోకాళ్లోతు వరద చేరి విద్యార్థులు అవస్థలు పడ్డారు. వరద బీభత్సం కొనసాగుతుండగానే విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. తుఫాన్ రూపంలో మరో మూడ్రోజులపాటు భారీవర్షాలు తప్పవన్న హెచ్చరికలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు చెప్పింది విశాఖ ఐఎండీ. 20న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తుఫాన్‌కు తోడుకానుందని స్పష్టం చేసింది. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపింది. ఏపీ వైపు పయనించి తుపాన్‌గా మారుతుందని హెచ్చరించింది. ఈ సైక్లోన్‌కు చిత్రాంగ్ అని పేరుకూడా పెట్టారు. దీని ప్రభావంతో ఏపీతోపాటు బెంగాల్, ఒడిషాకు మూడ్రోజులపాటు అతిభారీవర్షాలు తప్పవని స్పష్టం చేసింది. తుఫాను హెచ్చరికలతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. నష్టనివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..