Visakhapatnam: హనీట్రాప్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!

విశాఖ హనీట్రాప్‌ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. జాయ్‌ జెమీమాకు పలువురు సహకరించినట్లు గుర్తించి వారిపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. హైదరాబాద్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేసి విశాఖకు తరలించిన పోలీసులు.. ఇంకా బాధితులు ఉంటే ముందుకు రావాలని సూచించారు. మరోవైపు నిందితుల అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది.

Visakhapatnam: హనీట్రాప్‌ కేసులో సంచలన ట్విస్ట్‌.. ఈసారి బయటకొచ్చిన NRI బాధితులు..!
Vizag Honey Trap Case
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 28, 2024 | 8:50 AM

సంచలనాలకు కేరాఫ్‌గా మారింది విశాఖ హనీట్రాప్‌ కేసు. రోజుకో అప్‌డేట్‌.. పూటకో ట్విస్ట్‌తో పక్కా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉన్న క్రైమ్‌ కథా చిత్రంగా తయారైంది. ఆ మధ్య జమీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్‌ మద్దతు ఇవ్వడం.. ఆ తర్వాత సీపీ సంచలన విషయాలు వెల్లడించడం.. లేటెస్ట్‌గా ఓ బాధితుడి తల్లి బయటకొచ్చి వేధింపులు ఎక్కువ అవుతున్నాయనడం.. ఇలా ప్రతీ విషయమూ కేసుపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇటు పోలీసులకూ సవాల్‌గానూ మారింది.

విశాఖ హనీట్రాప్‌ కేసులో విచారణ జరిగే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే జాయ్‌ జెమీమాతోపాటు ముగ్గుర్ని జైలుకు పంపిన విశాఖ పోలీసులు… మరో ముగ్గుర్ని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక జమీమా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పలు స్టేషన్లలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక లెటెస్ట్‌గా ఓ బాధితుడి తల్లి బయటకొచ్చి పలువురు టార్చర్‌ చేస్తున్నారనడం హాట్‌ టాపిక్‌గా మారింది.

మొన్నా మధ్య జాయ్‌ జామీమాకు మాజీ ఎంపీ హర్షకుమార్ మద్దతుగా మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. జమీమా నిందితురాలు కాదు… బాధితురాలు అంటూ ఫుల్‌ సపోర్ట్‌గా మాట్లాడారు హర్షకుమార్. కావాలనే ఆమెను నిందితురాలిగా చిత్రీకరించారని ఆరోపించారు. పోలీసుల తీరుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, లక్షలు పోయినా మీడియా ముందుకు రాని బాధితులు, హర్షకుమార్ వ్యాఖ్యలతో బయటకు వచ్చారు. జాయ్ జమీమా తన కుమారుడిని ట్రాప్‌ చేసి లక్షలు కాజేసిందని ఓ ఎన్‌ఆర్‌ఐ బాధితుడి తల్లి ఆరోపించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన కుమారుడికి పరిచయమై.. బంధించి డబ్బు కాజేసిందని తెలిపింది. హర్షకుమార్‌కు జామీమా గురించి ఏం తెలుసని ఆమెకు మద్దతిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ బాధితుడి తల్లి.

అలా ప్రెస్‌మీట్‌ పెట్టిన జమీమా గురించి చెప్పినప్పటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయంటూ మరోసారి విశాఖ పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది బాధితుడి తల్లి. తమ కుటుంబాన్ని వేధించడమే కాదు… తమకు సపోర్ట్‌గా నిలిచిన మహిళలను టార్చర్‌ చేస్తున్నారని.. సోషల్‌ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. NRI బాధితుడి తల్లికి బెదిరింపులపై స్పందించారు విశాఖ సీపీ బాగ్చి. ఎవరి నుంచి బెదిరింపులు వచ్చినా… అసభ్యకర పోస్టులు పెట్టినా వెంటనే పోలీసులను సంప్రదించాలన్నారు. దర్యాప్తు చేసి వారిని పట్టుకుంటామంటున్నారు.

ఇదిలావుంటే, విశాఖ జాయ్ జెమీమా హనీ ట్రాప్ కేసులో మరో ముగ్గురు కీలక నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఫాతిమా ఉస్మాన్ అలియాస్ జోయా, ఆమె భర్త తన్వీర్, అవినాష్ బెంజమిన్‌లుగా గుర్తించారు. హైదరాబాద్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్‌పై విశాఖకు తరలించారు. విశాఖ కోర్టులో హాజరు పరిచి.. న్యాయస్థానం ఆదేశాలతో నిందితులను సెంట్రల్ జైలుకు తరలించారు. జాయ్ జెమీమా టీమ్‌కు మత్తు పదార్థాలు, స్ప్రే సరఫరాలో ఈ ముగ్గురు నిందితులు కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే జాయ్ జెమీమా, ఫారెస్ట్ ఆఫీసర్ వేణు రెడ్డి, కార్ డెకార్స్ యజమాని వేముల కిషోర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లెటెస్ట్‌గా ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేయడంతో.. మొత్తం నిందితుల అరెస్టుల సంఖ్య ఆరుకు చేరింది. అయితే బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ముందుకు రావాలని సూచిస్తూ పోలీసులు ప్రకటన జారీ చేశారు.

మరోవైపు ఈ కేసులో వరుస అరెస్ట్‌లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ కేసులో నిందితుల సంఖ్య ఆరుకు చేరగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. మరి చూడాలి…! ఈ కేసు మున్ముందు ఇంకెలాంటి మలుపులు తిరుగుతోందో..!

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..