AP News: ఆ రోడ్లపై వెళ్లాలంటే సిగ్గు, భయంగా ఉంది.. జిల్లా పరిషత్ చైర్మన్ ఆవేదన

| Edited By: Ram Naramaneni

Jul 28, 2023 | 9:33 AM

స్వయంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌ తన కారుకు ఉన్న హోదా బోర్డ్‌ను తీసేసి తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానించడంతో సమీక్షకు హాజరైన అధికారులు అంతా ఖంగుతిన్నారు. కాసేపటికి తేరుకున్న రోడ్లు, భవనాల శాఖ సూపరిండెంటెండ్ ఇంజనీర్ స్పందించారు.

AP News: ఆ రోడ్లపై వెళ్లాలంటే సిగ్గు, భయంగా ఉంది.. జిల్లా పరిషత్ చైర్మన్ ఆవేదన
ZP Chairman Subhadra
Follow us on

విశాఖపట్నం, జులై 28:  ఆంధ్రప్రదేశ్ లో రహదారుల నిర్వహణ పై అనేక విమర్శలు ఉన్నాయి. దీనిపై ప్రతిపక్షాలు సోషల్ మీడియా లో అనేక మీమ్స్, ట్రోల్స్ కూడా నడిపిన సందర్భాలూ ఉన్నాయి. ప్రతిపక్షాలు అంటే పర్లేదు కానీ అధికార పార్టీ కి చెందిన విశాఖ జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర గురువారం జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం లో మాట్లాడిన మాటలు యధావిధిగా చూస్తే…. “వారానికి రెండుసార్లు నేను పాడేరు వెళుతుంటాను. చోడవరం నుంచి తాటిపర్తి వరకు సుమారు 23 కిలోమీటర్లు ప్రయాణానికే రెండు గంటలు పడుతుంది. రహదారిపై లోతైన గుంతలు ఉన్నాయ్. కారులో వెళ్లాలంటేనే నాకు భయమేస్తోంది, అలాంటిది బస్సులు, బైక్‌లపై వెళ్లేవారి పరిస్థితి ఎలా ఉంటుంది. ఆ రోడ్డులో తిరగాలంటే నా కారు కు అమర్చిన ‘జడ్పీ చైర్‌పర్సన్‌’ బోర్డును తీసి దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది, ఎన్ని సార్లు చెప్పినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు”.. అని ఒక జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు.

విశాఖ నుంచి పాడేరు వెళ్ళే మార్గంలో చోడవరం-తాటిపర్తి మధ్య రోడ్డు చాలా అధ్వానంగా తయారైందనీ, రోడ్డంతా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా పరిషత్‌ స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో భాగంగా ఇంజనీరింగ్‌ విభాగాలపై సమీక్షలో భాగంగా జరిగిన చర్చలో పాల్గొన్న సుభద్ర చోడవరం-మాడుగుల మధ్య రోడ్డుపై ప్రయాణమంటేనే భయమేస్తోందని, అలాలంటి రహదారుల మరమ్మత్తులకు ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక సార్లు చెప్పినా చర్యలు లేవంటూ రోడ్లు, భవనాల శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్త రహదారుల నిర్మాణం చేయలేకపోయినా గుంతలు పూడ్చడానికి కూడా ఇబ్బంది ఏంటని మండిపడ్డారు.

కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదంటున్న అధికారులు

స్వయంగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్‌ తన కారుకు ఉన్న హోదా బోర్డ్‌ను తీసేసి తిరగాల్సి వస్తుందని వ్యాఖ్యానించడంతో సమీక్షకు హాజరైన అధికారులు అంతా ఖంగు తిన్నారు. కాసేపటికి తేరుకున్న రోడ్లు, భవనాల శాఖ సూపరిండెంటెండ్ ఇంజనీర్ కాంతి మతి స్పందిస్తూ అక్కడ రహదారుల మరమ్మత్తులు, కొత్త రోడ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందకు రావడం లేదని న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో ఈ మార్గంలో నూతన రహదారుల నిర్మాణానికి టెండర్లు కూడా పిలిచామన్నారు. అయితే బిల్లుల చెల్లింపు కాంట్రాక్టర్లు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని, బిల్లులకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నా ముందుకు రావడం లేదంటూ చెప్పుకొచ్చారు. మరోసారి కాంట్రాక్టర్‌లను పిలిచి మాట్లాడి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామనీ చెప్పుకొచ్చారు.

దీంతో కాంట్రాక్టర్లు తో సమావేశాన్ని ఏర్పాటు చేయమని అధికారులను ఆదేశించిన జడ్పీ చైర్‌పర్సన్ పాడేరు వెళ్లేటప్పుడు చోడవరం నుంచి మాడుగుల వరకు తన అధికారిక వాహనానికి అమర్చిన “జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌” అనే బోర్డును దాచుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొనేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అయ్యుండి నిరంతరం అదే రోడ్లలో తిరుగుతూ ఉంటే ఎవరైనా ఆపి ఇదేం పాలన అంటే ఏం చెప్పాలన్న భయం వేస్తోందన్న అర్దం వచ్చేలా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం కాంట్రాక్టర్‌లను పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.