AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: గోడ చెప్పిన సాక్ష్యం…! ఆ అంకెలే హంతకుడిని పట్టించాయి

- గ్రామ శివారులోని నిర్మానుష్య ప్రాంతంలో డెడ్ బాడీ.. అది కూడా మహిళది..! ఓ 45 ఏళ్ల వయసు ఉంటుంది. దారుణ హత్యకు గురైనట్టు గాయాలు. కసితీరా చంపినట్టు ఆనవాళ్లు.. మరి ఆ హంతకుడు ఎవరు..?! హత్యకు కారణం ఏంటి..? పోలీసులకు కనీసం ఆ మహిళ ఎవరు అన్నది కూడా తెలియని సమయంలో.. సమీపంలోని ఓ గోడ సాక్ష్యం చెప్పింది. హంతకుడుని పట్టించింది. ఎలా..?!

Vizag: గోడ చెప్పిన సాక్ష్యం...! ఆ అంకెలే హంతకుడిని పట్టించాయి
Accused Pradeep
Ram Naramaneni
|

Updated on: Jun 19, 2023 | 5:43 PM

Share

విశాఖ తగరపువలస సంతపేట వద్ద ఈ నెల 11న మహిళ మృతదేహం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పొట్ట పొట్ట దిగువ భాగాన తీవ్రంగా గాయపరిచి… హత్య చేసి ఆపై కూడా మృతదేహంపై కసి తీర్చుకున్నట్టు కనిపించింది. డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. శరీరంపై గాయాలతో పాటు , పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్ట్ తో హత్యగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు… ఆధారాల కోసం వేట ప్రారంభించారు. హత్యకు గురైన ఆ మహిళ ఎవరో తెలిస్తే.. హంతకుడ్ని గుర్తుపట్టొచ్చు అనుకున్నారు పోలీసులు.  సిసి కెమెరాలు శోధించారు. మృతురాలు విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతానికి చెందిన శ్రీలక్ష్మిగా గుర్తించి.. బంధువులతో మాట్లాడారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతదేహం కనిపించిన రెండు రోజుల క్రితం ఆమె కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు వెతికినా కనిపించలేదు. అంతలోనే ఆమె హత్యకు గురైనట్టు బంధువులు తెలుసుకున్నారు.

మరి హంతకుడు ఎవరు..?! గోడ చెప్పిన సాక్ష్యం ఏంటి..?!

– మహిళ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు… దాన్ని బంధువులకు అప్పగించారు. ఈలోగా నిందితుడిని ట్రాక్ చేసేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మృతదేహం లభ్యమైన పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడ ఎటువంటి ఆనవాళ్లు లేకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు. గ్రామంలో వెరిఫై చేసేసరికి.. ఓ గోడ మీద 3807 నెంబరు కనిపించింది. దాని గురించి కూపి లాగిన పోలీసులకు… కీలక క్లూ లభించినట్లు అయింది. ఎందుకంటే 3807 అనేది ఓ బైక్ నెంబర్. దాన్ని గ్రామస్తుల్లో ఒకరు గోడపై రాసారు. పోలీసులు ఆరా తీసే సరికి… మృతదేహం కనిపించిన ముందు రోజు ఓ బైక్ పై వ్యక్తి అనుమానాస్పదంగా వెళ్లడం గుర్తించారు. రాత్రిపూట ముందు భాగంలో ఒక మూటను పెట్టుకొని.. కంగారుగా వెళ్ళిపోతున్న ఆ వ్యక్తి.. బైక్ అదుపుతప్పడంతో కిందపడ్డాడు. అదే సమయంలో అతను కంగారు చూసిన గ్రామస్తులు… ఇదేదో తేడాగా ఉందని అనుమానించి బండి నెంబర్ 3807 ను గోడపై రాశారు. వారు చేసిన ఆ పనే ఇప్పుడు ఆ నిందితుడుని పట్టించింది.

– గోడపై రాసి ఉన్న ఆ నెంబర్ ఆధారంగా… నిందితుడు వినియోగించిన వాహనం బజాజ్ ప్లాటినా గుర్తించిన పోలీసులు… ఆ నెంబర్ను ట్రాక్ చేసి AP39 HK 3807 గా బండిని నిర్ధారించుకున్నారు పోలీసులు. తగరపువలస సమీపంలో వాహనాలు చెక్ చేస్తున్న పోలీసులకు… 3807 నెంబర్ తో వచ్చిన బండి కనిపించింది. అతన్ని అదుపులోకి తీసుకునని ప్రశ్నించేసరికి… హంతకుడు అతడే అని తేలిపోయింది.

ఇంతకీ ఆమెను ఎందుకలా చంపేశాడు..?!

– కేరళకు చెందిన ప్రదీప్… తగరపువలసకు సమీపంలో ఓ కంపెనీలో ఫ్యాబ్రికేషన్ వర్క్స్ చేస్తున్నాడు. అదే కంపెనీలో గతంలో పనిచేసిన మానేసిన ఓ మహిళ… అక్కడ కొంతమందితో పరిచయం ఉంది. గతంలో మహిళ అతనికి పరిచయమైంది. భార్య పిల్లలు ఊరెళ్లడంతో.. పరిచయం ఉన్న శ్రీలక్ష్మిని ఇంటికి పిలిపించుకున్నాడు ప్రదీప్. శారీరకంగా కలిశారు. 800 రూపాయలు కావాలని అడగడంతో… డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ప్రదీప్ ఆమెను హత్య చేశాడు.

మృతదేహాన్ని ముక్కలుగా చేయాలనుకున్నాడు..!

– శ్రీలక్ష్మితో జరిగిన పెనుగులాటలో.. భవనం పైనుంచి కిందకు తోచేసాడు. కొన ఊపిరితో ఉన్న ఆమెను తొలుత ఓ వస్త్రంతో మెడ బిగించాడు. ఆమె మృతి చెందాక ఆందోళన చెందిన ప్రదీప్… డెడ్ బాడీని తరలించడం ఎలా అని అనుకొని కంగారుపడ్డాడు. మహిళ డెడ్ బాడీ బరువు ఎక్కువగా ఉండటంతో ముక్కలుగా కోద్దామని అనుకున్నాడో ఏమో గాని కత్తి పట్టుకున్నాడు. గాయాలు అయితే శరీరంలో ఉన్న రక్తం పోయి మృతదేహం తేలికగా మారుతుందని అనుకుని పొట్ట కింది భాగంలో గాయపరిచాడు. ఫలితం లేకపోవడంతో పాటు ఎవరైనా చూసేస్తారా అన్న భయంతో.. మృతదేహాన్ని బెడ్ షీట్‌లో చుట్టి.. వాహనం పెట్రోల్ ట్యాంక్ పై పెట్టి నడుపుకుంటూ ముందుకెళ్లాడు. తగరపువలస ఆదర్శనగర్ గొల్ల వీధి నిర్మానుష్య ప్రాంతంలో మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు.

మృతదేహం తీసుకెళుతున్న క్రమంలోనే…

– హత్య చేశాక ఆమె మృతదేహాన్ని తీసుకెళ్తున్న క్రమంలో వాహనం అదుపుతప్పి గుంతలో పడింది. అదే సమయంలో ప్రదీప్ పాదరక్షలు కాలి నుంచి జారిపోయాయి. వాహనం మందు భాగంలో మడ్గర్ విరిగి పెద్ద శబ్దం వచ్చింది. అక్కడ నుంచి హడావిడిగా మళ్లీ వాహనంపై వెళ్ళిపోతున్నట్టు చూసిన స్థానికుల్లో ఒకరు… వాహనంకు సంబంధించిన నాలుగు అంకెల నెంబర్‌ను గోడపై రాశారు. అదే ఆ నిందితుడిని పట్టించింది. డీసీపీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో ఏసిపి శివరామరెడ్డి, భీమలి సిఐ లక్ష్మణామూర్తి, ఎస్సై హరీష్ లో కేసును చేదించారు. ఆధారాలు అన్ని నిర్ధారించుకున్న తర్వాత నిందితుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

– ఆమె శరీరంపై ఉన్న గాయాల బట్టి చూస్తే.. పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెను హింసించి చంపారా అన్న కోణంలో దర్యాప్తు చేశారు. చంపిన తర్వాత శరీరాన్ని గాయపరిచినట్లు గుర్తించారు పోలీసులు. కేవలం ఎనిమిది వందల కోసం జరిగిన వాగ్వాదంలో ఈ హత్య జరిగినట్టు నిర్ధారించారు. అయితే… ఈ కేసును చేధించేందుకు ఆ నాలుగు అంకెల నెంబరే పోలీసులకు కీలకంగా మారింది.

— ఖాజా, వైజాగ్, టీవీ9 తెలుగు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం