Three women missing in Visakha : విశాఖపట్నం జిల్లా పైనాపిల్ కాలనీ దగ్గరున్న మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వదార్ మహిళా పునరావాస కేంద్రంలో ఉంటున్న ముగ్గురు మహిళలు అదృశ్యమయ్యారు. బాత్రూమ్ కిటికీ నుంచి గోడ దూకి వెళ్లి పోయారు. అదే టైంలో అక్కడ ఉంటున్న మిగతా ఆడపిల్లలు చూసి గట్టిగా కేకలు వేశారు. అప్పటికే ఆ ముగ్గురు ఆటోలో జారుకున్నారు. విషయం తెలుసుకున్న ప్రగతి కేంద్రం డిప్యూటీ మేనేజర్ రామకుమారి, పర్యవేక్షకురాలు నాగేశ్వరీ అరిలోవ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
అయితే, సదరు ముగ్గురు మహిళలు ఎక్కడికి వెళ్లారు..ఎవరితో వెళ్లారు అన్నదానిపై ఆరాతీస్తున్నారు. ఐతే అంత పెద్ద మహిళా కేంద్రంలో సరైన సెక్యురిటీ గాని..రక్షణ గోడ కూడా సరిగ్గా లేకపోవడం వల్లనే ఇటువంటివి జరుగుతున్నాట్లుగా తెలుస్తోంది. విభిన్న సమస్యల బాధిత మహిళలు ఈ కేంద్రంలో మొత్తంగా 12 మంది ఆశ్రయం పొందుతున్నారు. ముగ్గురు మహిళలు ఒకేసారి పారిపోవడంతో సంస్థలో ఆందోళన మొదలైంది.
ముగ్గురిలో ఓ మహిళ.. ఇటీవల మారికవలసలో హత్యకు గురైన చిన్నారి సింధుశ్రీ తల్లి. చిన్నారిని హత్య చేయడంతో ప్రియుడు జైలుకెళ్ళాడు. కుటుంబానికి దూరమైన ఆ మహిళను పోలీసులు స్వధార్ హోంలో పెట్టారు. దాదాపు నెలరోజులుగా ఆమె ఇక్కడే ఆశ్రయం పొందుతోంది. ఇప్పుడు మరో ఇద్దరితో కలిసి అధికారులకు చెప్పకుండా పారిపోయింది.