Navy Day: సాగర తీరంలో అబ్బురపర్చిన నేవీ సాహస విన్యాసాలు.. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సాగర తీరంలో నేవీ సాహస విన్యాసాలు అధరహో అనిపించాయి. తమ సత్తాను చాటుతూ.. నింగి, నేల, నీటిపై.. మన కమాండోలు చేసిన ప్రదర్శనలు.. ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి..

Navy Day: సాగర తీరంలో అబ్బురపర్చిన నేవీ సాహస విన్యాసాలు.. హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Vizag
Follow us

|

Updated on: Dec 04, 2022 | 10:00 PM

సాగర తీరంలో నేవీ సాహస విన్యాసాలు అధరహో అనిపించాయి. తమ సత్తాను చాటుతూ.. నింగి, నేల, నీటిపై.. మన కమాండోలు చేసిన ప్రదర్శనలు.. ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. విపత్కర, ఎమర్జెన్సీ సమయాల్లో ఎలా పనిచేస్తారనే దానిపై డ్రిల్స్ నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరవడం ఈ వేడుకల ప్రత్యేకం. నేవీ డే సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నౌకాదళ విన్యాసాలు అబ్బురపరిచాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ ఆమె స్వాగతం పలికారు. నేవీ డేని పురస్కరించుకుని భారత నేవీ ప్రచురించిన ప్రత్యేక బ్రోచర్ ను ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఐఎన్‌ఎస్‌ సింధు వీర్‌ సబ్‌మెరైన్ ద్వారా రాష్ట్రపతికి త్రివర్ణ బాంబర్లతో నౌకాదళం ఘన స్వాగతం పలికింది.

హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోలు జెమిని బోట్లలోకి దిగారు. ఆ బోట్లు ఎంతో వేగంతో దూసుకొచ్చాయి. తీరంలో కమాండోలు యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహించారు. ఆపద సమయాల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలను ప్రదర్శించారు. మువ్వన్నెల ప్యారాచూట్‌తో బీచ్‌లో దిగడం, 4 యుద్ధ నౌకలపై ఒకేసారి హెలికాప్టర్లు ల్యాండింగ్, టేకాఫ్ అవడం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. నేవీకి చెందిన మిగ్-29 యుద్ధవిమానాలు గగనతలంలో దూసుకెళ్లాయి. యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌ల నుంచి ఒకేసారి రాకెట్ ఫైరింగ్ చేయడాన్ని.. వీక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.

ఈ విన్యాసాల్లో ఏఎల్ హెచ్ హెలికాప్టర్లు, అత్యాధునిక యూహెచ్ బీ హెలికాప్టర్లు కూడా పాల్గొన్నాయి. ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు కలిగివున్న అత్యాధునిక యుద్ధ విమానాలను కూడా నేవీ డే విన్యాసాల్లో ప్రదర్శించారు. బోయింగ్ రేంజ్ పీఎస్ఐ విమానాల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ విమానాలు ఆకాశంలో తిరుగుతూ విన్యాసాలు చేయడం ఆసక్తి కలిగించింది. సముద్ర జలాల్లో ఉన్న యుద్ధ నౌకలు లైటంగ్‌తో మెరిసిపోయాయి.

ఇవి కూడా చదవండి

అంతకు ముందు విజయవాడలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పౌరసన్మానం జరిగింది. రాష్ట్రపతిగా తొలిసారి ఏపీకి వచ్చిన ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రభుత్వం ఘనంగా పౌర సన్మానం చేసింది. తిరుమల శ్రీవారు కొలువైన ఈ నేలకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దేశభాషలందు తెలుగు లెస్స అని.. అన్ని భాషల్లోకెల్లా తెలుగు శ్రేష్టమైనదంటూ కొనియాడారు. సాదర స్వాగతానికి, తెలుగు ప్రజల అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారామె. సోమవారం ఉదయం.. తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. అలిపిరిలోని గోమందిరం, తిరుచానూరు అమ్మవారి దర్శనం, పద్మావతి మహిళా యూనివర్సిటీలో జరిగే కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి