Vande Bharat Express: ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ రెండు నగరాల మధ్య పరుగులు పెట్టనున్న వందే భారత్‌

|

Nov 25, 2022 | 7:08 AM

విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రస్తుతం రైలు ప్రయాణానికి 6 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్‌ రైలు రాకతో కేవలం 4 గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు.

Vande Bharat Express: ఏపీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ఆ రెండు నగరాల మధ్య పరుగులు పెట్టనున్న వందే భారత్‌
Vande Bharat Express
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పట్టాలెక్కనుంది. అత్యాధునిక సౌకర్యాలతో పాటు అమితవేగంతో దూసుకెళుతోన్న ఈ సెమీ హైస్పీడ్‌ రైలు ఏపీలోను పరుగులు పెట్టనుంది. మొదటి దశలో భాగంగా విశాఖపట్నం నుంచి విజయవాడ వరకు నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో అధికారికంగా ప్రారంభించేందుకు విస్తృత స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో విశాఖకు రానున్న ఈ ట్రైన్‌ ట్రయల్‌ రన్‌ వచ్చే నెలలో నిర్వహించనున్నారు.  సాధారణంగా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకెళ్లనున్నాయి. ఈ లెక్కన విశాఖపట్నం నుంచి విజయవాడకు ప్రస్తుతం రైలు ప్రయాణానికి 6 గంటల సమయం పడుతుండగా.. వందే భారత్‌ రైలు రాకతో కేవలం 4 గంటల్లోనే విజయవాడ చేరుకోవచ్చు. కాబట్టి ప్రయాణికులకు రెండు గంటల ప్రయాణం తగ్గనుంది.

అత్యాధునిక సదుపాయాలతో..

కాగా ఈ రైళ్లో అత్యాధునిక సదుపాయాలుంటాయి. ముఖ్యంగా ఎమర్జెన్సీ లైటింగ్‌ వ్యవస్థ ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 లైట్లు ఉంటాయి. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఈ లైట్లు ఉపయోగపడతాయి. అలాగే కోచ్‌లకు బయటవైపు నుంచి 4 కెమెరాలు అమర్చి ఉంటాయి. వెనుక వైపు నుంచి మరొకటి ఉంటుంది. ప్రతి కోచ్‌కు 4 ఎమర్జెన్సీ ద్వారాలు ఉంటాయి. అన్ని కోచ్‌లు పూర్తిగా ఏసీ సదుపాయంతో ఉంటాయి. ఇక అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన అగ్నిమాపక పరికరాలు కొద్దిపాటి పొగను కూడా వెంటనే పసిగట్టి ప్రయాణికులను అప్రమత్తం చేస్తాయి. ఇక ఇందులో చైర్‌కార్, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయి. ప్రస్తుతం వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న వందేభారత్‌ రైళ్లలో నిర్దేశించిన ధరల ప్రకారం చూస్తే విజయవాడకు చైర్‌కార్‌లో దాదాపు రూ.850, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో రూ.1,600 నుంచి రూ.1,650 వరకూ ఉండే అవకాశాలున్నాయి.

మూడేళ్లలో మరిన్ని వందే భారత్‌ రైళ్లు..

ఇక వచ్చే మూడేళ్లలో 475 వందే భారత్ రైళ్ల తయారీకి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే 2026 కల్లా మొదటి బుల్లెట్‌ ట్రైన్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి తెలిపారు. రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధిపై మంత్రి మాట్లాడుతూ 138 స్టేషన్లకు మాస్టర్‌ప్లాన్లు రూపొందించామని, 57 స్టేషన్లకు డిజైన్లు ఖరారు చేశామన్నారు. ‘475 వందేభారత్ రైళ్ల లక్ష్యం.. గత బడ్జెట్‌లో 400 రైళ్లను మంజూరు చేశాం. అంతకు ముందు 75 రైళ్లను మంజూరు చేశాం. రాబోయే మూడేళ్లలో పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటాం’ అని మంత్రి స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..