ఇటీవల హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఓ చెత్తకుప్ప వద్ద పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగయ్య అనే ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండగా.. ఈ తరహా సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయన్న దానిపై నిపుణులు స్పందించారు. పెయింట్స్‌లో వాడే సాల్వెంట్ మెటీరియల్ ను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల అందులో గ్యాస్ ఏర్పడి పేలుళ్లు జరుగుతున్నట్లు గుర్తించారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే టర్పేంట్ ఆయిల్ ఈటర్.. బేస్డ్ కాంపౌండ్ నుంచి పేరొక్సిడ్ కాంపౌండ్‌గా మారి పేలుళ్లు సంభవిస్తున్నాయని నిపుణులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పెయింట్స్ డబ్బాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పెయింట్స్ వాడిన తరువాత టిన్నర్ మెటీరియల్‌ని వెంటనే పడేయాలని.. లేదంటే క్యాప్ పెట్టకుండా ఉండాలని వారు అంటున్నారు. చాలా మంది మళ్లీ ఉపయోగపడతాయని.. పెయింట్స్‌తో పాటు సాల్వెంట్ పదార్దాలను నిల్వ ఉంచుతున్నారని.. వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో పెయింట్‌ని నిల్వ చేయడం ద్వారా ఎలాంటి ప్రమాదం లేకపోయినా.. దానికి అనుబంధంగా సాల్వెంట్ లాంటి పదార్దాలను ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు.