AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాటుకు భర్త సహా కుటుంబం బలి..ఒంటరైన గర్భిణి..

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలిస్తోంది. కరోనా కాటుకు బలైన.. కుటుంబ సభ్యుల వేదనను ఎవరూ తీర్చే లేకపోతున్నారు. వరంగల్‌లో చోటు చేసుకున్న ఓ విషాద సంఘటన..

కరోనా కాటుకు భర్త సహా కుటుంబం బలి..ఒంటరైన గర్భిణి..
Jyothi Gadda
|

Updated on: Jul 18, 2020 | 12:03 PM

Share

దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలిస్తోంది. కరోనా కాటుకు బలైన.. కుటుంబ సభ్యుల వేదనను ఎవరూ తీర్చే లేకపోతున్నారు. వరంగల్‌లో చోటు చేసుకున్న ఓ విషాద సంఘటన తెలిస్తే..ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. ప్రేమించి పెళ్లి చేసుకొని.. నిండు నూరేళ్లు కలిసి ఉండాలనుకున్న ఓ జంటను కరోనా వెంటాడింది. నిండుకుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేసింది.

వరంగల్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భర్త, అత్తమామలతో ఆ యువతి కాపురం హాయిగా సాగింది. వారి సంతోషానికి గుర్తుగా ఆమె గర్భం దాల్చింది. ఇంతలోనే వారి కుటుంబంలోకి కరోనా మహమ్మారి వచ్చి చేరింది. ఆమె అత్తమామలకు కరోనా సోకింది. దీంతో వారిని వరంగల్ ఎంజీఎంలో చేర్పించి చికిత్స అందజేస్తుండగా, పరిస్థితి విషమించి ఒకరి తర్వాత మరొకరు.. అత్తామామలిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, ఆమె భర్తకు కూడా కరోనా సోకింది. వరంగల్ ఎంజీఎంలో చేర్పించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె భర్త కూడా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు కోల్పోయాడు.

ఎన్నో ఆశలతో కోరి పెళ్లిచేసుకున్న భర్త కొద్ది రోజుల వ్యవధిలోనే ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయాడు. కడుపులో బిడ్డను చూడకుండానే వారం వ్యవధిలోనే అటు అత్తమామలు, ఇటు భర్త చనిపోవడంతో ఆమె పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. కరోనా కాటుకు ఆ కుటుంబంలో ముగ్గురు బలైన తీరు అందర్నీ కలచివేసింది.