జీ 20 సదస్సు ద్వారా విశాఖ ఇమేజ్ మరింత పెరుగుతోందన్నారు ఏపీ మంత్రులు. సదస్సు కోసం స్టీల్ సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పురపాలక శాఖ ఆధ్వర్యంలో 130 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపట్టారు. రోడ్ల మరమ్మత్తు పనులు చేపట్టారు. కేవలం సుందరీకరణే కాకుండా శాశ్వత నిర్వహణకు చర్యలు చేపట్టామని వివరించారు. విశాఖపట్నంలో పరిపాలన రాజధానికి తగ్గట్లు అభివృద్ధి పనులు జరిగాయన్న మంత్రులు.. కొత్తగా 5 బీచ్‌లు అభివృద్ధి చేస్తున్నామన్నారు. G -20 ఏర్పాట్లపై మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజనీ, గుడివాడ అమర్ విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎల్లుండి సీఎం జగన్ జీ20 సదస్సుకు హాజరు కాబోతున్నారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు జరిగే సదస్సుకు దేశ, విదేశాల నుంచి అతిథులు విశాఖ రాబోతున్నారు. అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక సదస్సుకు వచ్చే వివిధ దేశాలకు చెందిన అతిథులకు విమానాశ్రయంలో వారికి స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అతిథుల రోజు వారి కార్యక్రమాలు, వారి పర్యటనకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో అవసరమైన ఏర్పాట్లకు తగు చర్యలు చేపట్టారు. వారు బస చేయు హోటల్ వద్ద 24/7 హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ లో రెవెన్యూ, జీవీఎంసీ, మెడికల్, పర్యాటకశాఖలకు సంబంధించిన సిబ్బందిని అందుబాటులో ఉండేలా 3 షిఫ్టులుగా పనిచేసేలా ఏర్పాట్లు చేయాశారు. విమానాశ్రయంలోనూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..