Vangalapudi Anitha: ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి .. ఏం ప్రామిస్ తీసుకున్నారో తెలుసా..?

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత.. రాఖీ పండగను వినూత్నంగా జరుపుకున్నారు. రాఖీలు తీసుకొని విశాఖపట్నంలోని సెంట్రల్ జైలుకు వెళ్లిన హోమంత్రి.. అక్కడున్న జైళ్ల శాఖ అధికారులతో పాటు 30 మంది ఖైదీలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత గంజాయి రవాణాలో పట్టుబడిన ఖైదీలకు గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.

Vangalapudi Anitha: ఖైదీలకు రాఖీ కట్టిన హోంమంత్రి .. ఏం ప్రామిస్ తీసుకున్నారో తెలుసా..?
Ap Home Minister

Edited By: TV9 Telugu

Updated on: Aug 11, 2025 | 1:53 PM

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత శనివారం విశాఖలోని కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె జైల్లోని యువ ఖైదీలకు రాఖీలు కట్టారు. మొత్తం 30 మంది ఖైదీలకు స్వయంగా రాఖీలు కట్టిన మంత్రి అనిత.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి రవాణాలో నిందితులుగా ఉన్న ఖైదీలకు గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. తెలిసి తెలియని వయస్సులో ఈజీమనీ కోసం తీసుకునే నిర్ణయాలు జీవితాన్ని నాశనం చేస్తాయని ఆమె చెప్పారు. మంచిచెడులను యువత తెలుసుకోవాలన్నారు. ‘మీకు బంగారు భవిష్యత్తు ఉంది.. దాన్ని నాశనం చేసుకోకండి.. బ్రతకడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి.. ఖైదీల జీవితాల్లో మార్పు రావాలి’ అని అన్నారు హోం మంత్రి అనిత.

వచ్చే సంవత్సరం రాఖీ పండుగను మీ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో జరుపుకునే స్థితికి చేరాలని.. ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తెలిసి తెలియక చేసిన తప్పుతో బాధపడే కంటే.. మంచి నడవడిక అలవర్చుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా జైళ్లశాఖ అధికారులకు కూడా రాఖీలు కట్టి సోదరీ స్నేహాన్ని పంచుకున్నారు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హోం మంత్రి స్పష్టం చేశారు.

రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేశారు. విశాఖ ఎంవీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి ఆటో డ్రైవర్ గిరీశ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి, రాఖీ కట్టారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూనే అంకితభావంతో విధులు నిర్వహిస్తుండడంపై అభినందించారు. ఆయనకు ధైర్యం చెప్పారు. కానిస్టేబుల్ పూర్తి సాయం అందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.