కళ్ళన్నీ అటువైపే..! విశాఖలో అరుదైన ఆసియా సింహం కూనలు.. ఎంత క్యూట్‌గా ఉన్నాయో..
విశాఖపట్నంలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్‌లో అరుదైన ఆసియా సింహం నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కుమారి అనే ఆడ సింహం ఒకే కాన్పులో నాలుగు కూనలకు జన్మనివ్వడంతో జూ సందడిగా మారింది. ప్రస్తుతం తల్లి సంరక్షణలో ఉన్న కూనలను ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ఉంచి వెటర్నరీ వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.

విశాఖలోని ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ లో ఇప్పుడు సందర్శకుల కళ్ళన్నీ అటువైపే..! జూలోని ‘కుమారి’ అనే ఆసియా జాతి ఆడ సింహం ఒకే కాన్పులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. నెల రోజుల క్రితం జన్మించిన ఈ పిల్లలు ప్రస్తుతం తల్లి సంరక్షణలో ఉన్నాయి. జూ వెటర్నరీ వైద్యులు సిబ్బంది నిరంతరం వాటిని పర్యవేక్షిస్తున్నారు. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణుల ప్రాణుల జాబితాలో ఉన్నాయి ఈ ఆసియా సింహలు. వాటి సంతతి విశాఖ జూలో వృద్ధి చెందడంపై వన్యప్రాణి ప్రేమికులు, పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లి సింహంతో పాటు నాలుగు పిల్లలూ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని జూక్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు. పుట్టిన పిల్లలకు ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేక ఎన్ క్లోజర్ లో ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తల్లి సింహానికి న్యూట్రిషన్ డైట్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఆసియా సింహాల సంఖ్య క్రమంగా తగ్గుతున్న తరుణంలో… విశాఖ జూలో ఒకేసారి నాలుగు పిల్లలు జన్మించడం ఒక విశేష పరిణామం అని అంటున్నారు. జూలో ఏర్పాటు చేసిన సహజ వాతావరణం, అధికారులు తీసుకుంటున్న సంరక్షణా చర్యల ద్వారా ఆసియా సింహాల సంతాన ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అన్నారు అధికారులు. ఈ సింహపు పిల్లలు సాధారణ స్థితికి వచ్చిన అనంతరం.. కొద్ది రోజుల తర్వాత సందర్శకుల వీక్షణకు అనుమతిస్తామని క్యూరేటర్ మంగమ్మ అన్నారు.
విశాఖ జూలో 8 సింహాలు..
విశాఖ జూ పార్క్ లో ఇప్పటికే రెండు ఆడ, ఒక మగ పెద్ద సింహాలు ఉన్నాయి. వీటి ద్వారా సంవత్సర కాలం క్రితం రెండు సింహపు పిల్లలు పుట్టాయి. వీటిలో ఒక సింహం పిల్ల అనారోగ్యంతో మృతి చెందగా మరో సింహం ఆరోగ్యంతో సందడి చేస్తుంది. ఇప్పుడు తాజాగా కుమారి అనే ఆసియా సింహానికి ఓకే కాన్పులో నాలుగు సింహపు పిల్లలు పుట్టడంతో జూపార్క్ లో వీటి సంతానం 8 కి పెరిగింది. అంతరించిపోతున్న ఆసియా సింహాలు విశాఖ జూలో అభివృద్ధి చెందటంతో అటు జూ అధికారులు, ప్రకృతి పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
