చిన్న తిరుపతి బ్రహ్మోత్సవాలు: ద్వారకాతిరుమల శ్రీవారి కళ్యాణం, రథోత్సవం షెడ్యూల్ ఇదే
Dwarka Tirumala Brahmotsavams: ద్వారకాతిరుమల చిన్న తిరుపతి క్షేత్రంలో అక్టోబర్ 21 నుండి 28 వరకు ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 25న శ్రీవారి కళ్యాణం, 26న రథోత్సవం ప్రధాన ఘట్టాలు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రత్యేక ఉత్సవాల్లో స్వామివారు వివిధ అలంకారాల్లో దర్శనమిస్తారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కండి.

ఏలూరు: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి వైభవాన్ని చాటే దివ్య బ్రహ్మోత్సవాలకు ద్వారకాతిరుమల చిన్న తిరుపతి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కలియుగ వైకుంఠాన్ని తలపించే శ్రీవారి సన్నిధిలో ఆశ్వయుజ మాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్ నెల 21 నుంచి 28 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ క్షేత్రంలో నిత్య, వార, మాసోత్సవాలతో పాటు ఏటా రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ కాగా, వైశాఖ మాసంలో స్వయంభూ స్వామివారికి, ఆశ్వయుజ మాసంలో ప్రతిష్ఠిత స్వామివారికి వైఖానస ఆగమోక్తంగా ఈ ఉత్సవాలను జరుపుతారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో శ్రీవారు ఉభయదేవీలతో కలిసి వివిధ వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. అలాగే ఆలయ ముఖమండపంలో రోజూ ఒక ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుండగా, సాంస్కృతిక కార్యక్రమాల కోసం శ్రీహరి కళాతోరణం వేదికగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విద్యుత్ దీపాలంకరణతో పాటు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం ఈవో వేంద్ర త్రినాథరావు తెలిపారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని చెబుతున్నారు. ఈ నెల 25న స్వామివారి కల్యాణం, 26న రథోత్సవం వైభవంగా నిర్వహించనున్నామని, భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 28 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు అక్టోబర్ 21న శ్రీ భూ సమేత మహావిష్ణువుగా, 22న కాళీయమర్దనంగా, 23న శకటాసుర వధ రూపంలో, 24న శ్రీరామ పాదుకా సమేత భరతుడిగా, 25న మోహిని అలంకారంలో, 26న పాండురంగడిగా, 27న నవనీత కృష్ణుడిగా, అలాగే 28న శయన మహావిష్ణువు దివ్యమూర్తులుగా భక్తులకు కొలువుదీరనున్నారు.
అభివృద్ధికి నెలవుగా ద్వారకాతిరుమల తపోతలంపై వెలసిన ఈ క్షేత్రంలో స్వయంభూ చినవెంకన్న పుట్టలో ఆవిర్భవించగా, పాదపూజ సాక్షాత్కారం కోసం పెద్దతిరుపతి నుంచి మరో శ్రీవారి విగ్రహాన్ని తెచ్చి స్వయంభూగా వెనుక ప్రతిష్ఠించడంతో ఇక్కడ ఒకే అంతరాలయంలో ద్విమూర్తులు కొలువుదీరారు. తిరుమల శ్రీవారి మొక్కులను ఇక్కడ తీర్చుకోవడానికే కాకుండా, ఇక్కడి మొక్కులను పెద్దతిరుపతిలో తీర్చుకోవడం ఇక్కడి ప్రత్యేక ఆచారంగా ఉంది. ఈ క్షేత్రంలో 40 అడుగులకు పైగా ఎత్తున్న గురువంతుడు, అభయాంజనేయుడు, అన్నమాచార్యుల విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండగా, గత తొమ్మిదేళ్లలో సుమారు రూ. 99 కోట్లతో నిత్య కల్యాణ మండపం, అనివెట్టి మండపాలు, శాశ్వత క్యూ కాంప్లెక్స్, వరుసమత నిత్యాన్నదాన భవనం, ఘాట్ రోడ్డు నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. రవాణా సౌకర్యాల విషయానికి వస్తే, రైలు మార్గం ద్వారా వచ్చేవారు ద్వారకాతిరుమలకు 17 కి.మీ. దూరంలో ఉన్న భీమడోలు రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడి నుంచి బస్సులు లేదా ఆటోల ద్వారా క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే బస్సు మార్గంలో ఏలూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి నేరుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది.
ఉత్సవాల ప్రధాన షెడ్యూల్ ప్రకారం, అక్టోబర్ 21న ఉదయం 10.30 గంటలకు శ్రీవారిని పెండ్లికుమారుడిగా, అమ్మవార్లను పెండ్లికుమార్తెలుగా చేయుట, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై గ్రామోత్సవం జరుగుతుంది. అక్టోబర్ 22న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణం, హంస వాహనంపై గ్రామోత్సవం, అక్టోబర్ 23న ఉదయం 10.30 గంటలకు సూర్యప్రభ, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవలు నిర్వహించబడతాయి. అక్టోబర్ 24న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనం, రాత్రి 7 గంటలకు ఎదురు కోళ్ల ఉత్సవం, వెండి శేష వాహన సేవ ఉంటాయి. అక్టోబర్ 25న ఉదయం 7 గంటలకు సింహ వాహన సేవ, రాత్రి 8.30 గంటలకు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం వైభవంగా జరుగుతాయి. అక్టోబర్ 26న రాత్రి 7.30 గంటలకు స్వామివారి రథోత్సవం, అక్టోబర్ 27న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజారోహణం, అనంతరం అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు. చివరి రోజు అయిన అక్టోబర్ 28న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం జరగనుండగా, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగోత్సవంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
