విజయవాడ వెళ్లేవారికి, అక్కడే ఉండేవారికి అలెర్ట్.. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
విజయవాడ బందర్ రోడ్‌లోని స్వరాజ్ మైదాన్‌లో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. 6 గంటల 40 నిమిషాలకు, ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. తర్వాత భారీ స్థాయిలో ఫైర్ వర్క్స్ ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత డ్రోన్ షో ఉంటుంది. విగ్రహావిష్కరణకు సంబంధించిన శిలా ఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత విగ్రహ పాద పీఠంలో ఏర్పాటు చేసిన మినీ థియేటర్‌ను సీఎం జగన్ ప్రారంభిస్తారు.
విజయవాడ, జనవరి 18: ఏపీలో శుక్రవారం చారిత్రక ఘట్టానికి తెర లేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేసిన, ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. విజయవాడ బందర్ రోడ్డులో PWD గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఈ విగ్రహ ఆవిష్కరణకు ఏపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌కు తలమానికంగా ఉండేలా విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 206 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. ఒకప్పుడు బెజవాడ పేరు చెప్తే కొండపై కొలువున్న దుర్గమ్మ మాత్రమే గుర్తొచ్చేది. ఇప్పుడు దేశం మొత్తం తలుచుకునేలా, అంబేద్కర్ విగ్రహ రూపంలో విజయవాడకు మరో ప్రత్యేక మణిహారం సమకూరింది. బెజవాడ బందర్ రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అంబేద్కర్ స్మృతి వనంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో అధునాతన వసతులు కల్పించడంతో పాటు దీనిని టూరిస్టు స్పాట్‌గా తీర్చిదిద్దుతున్నారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచేలా ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ను ఏర్పాటుచేశారు. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేశారు.
అంబేడ్కర్ స్మృతి వనం పార్కులో ఏర్పాటు చేసిన ఈ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కోసం జగన్ సర్కార్ భారీగానే ఖర్చు చేసింది. రూ. 400 కోట్లకు పైగా వ్యయంతో దీన్ని నిర్మించారు. విగ్రహ ఏర్పాటు కోసం విడి భాగాలను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఇక ఈ విడి భాగాలను విగ్రహంగా అమర్చేందుకు స్కిల్డ్ వర్కర్స్, ఇంజనీర్లను ఢిల్లీ నుంచి రప్పించారు. దీనిలో పెద్ద కన్వెన్షన్ హాల్, అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ, అందులో ఆయన రాసిన, సేకరించిన 10 వేల పుస్తకాలు ఉంటాయి.బౌద్ధ ధ్యాన మందిరం, ప్రకృతి రమణీయత ఉట్టిపడే దృశ్యాలతో ఉద్యానవనాలు, 2 వేల మంది కూర్చునే వీలున్న ఓపెన్-ఎయిర్ థియేటర్ ఏర్పాటు చేశారు. మెమోరియల్ చుట్టూ వాటర్ ఫౌంటెన్, మ్యూజికల్ ఫౌంటెన్ ఏర్పాటు చేశారు. ఇక అంబేడ్కర్ స్మృతి వనం, విగ్రహ ఏర్పాటు కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి ఈ విగ్రహ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
* ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాహనాల రాకపోకలకి మళ్లింపులు కొనసాగుతాయి
* విజయవాడ నగరంలో ఉదయం 11 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి
* హైదరాబాద్-విశాఖ, విశాఖ- హైదరాబాద్ వైపు వాహనాలని ఇబ్రహీంపట్నం దగ్గర మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ మీదగా దారి మళ్లించనున్నారు
* చెన్నయ్ నుంచి వైజాగ్ వెళ్లే వాహనాలని ఒంగోలు దగ్గర డైవర్షన్.. చీరాల, బాపట్ల మీదగా మళ్లిస్తారు
* వైజాగ్ నుంచి చెన్నయ్ వెళ్లే వాహనాలని హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్లించడం జరుగుతుంది
* చెన్నయ్ నుంచి హైదరాబాద్…హైదరాబాద్ నుంచి చెన్నయ్ వెళ్లే వాహనాలని మేదరమెట్ట, అద్దంకి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ మీదగా మళ్లిస్తారు
* విశాఖ నుంచి చెన్నై వెళ్లే వాహనాలను హనుమాన్ జంక్షన్ బైపాస్ మీదుగా గుడివాడ, పామర్రు, చీరాల, ఒంగోలు మీదుగా మళ్లించనున్నట్టు తెలిపారు.
* ఎంజి రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 11 గంటల నుంచి ఉంటాయి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..