Andhra Pradesh: కాపు మంత్రం.. బీసీ తంత్రం.. సామాజిక సమీకరణాల్లో వైసీపీ దూకుడు..
కులాల చుట్టూ తిరిగే ఏపీ రాజకీయం... రాబోయే ఎన్నికల కోసం మరింత వేడెక్కుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజినీరింగ్... ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు కులగుణనకు శ్రీకారం.. మరోవైపు దళితబాంధవుడిగా అంబేద్కరుడికి భారీ విగ్రహం... శుక్రవారం ఒకేరోజున ఈ రెండు కీలక ఘట్టాలకు ఏపీ వేదిక కాబోతుండటం సరికొత్త చర్చకు దారితీసింది.
దేశంలో మరో రాష్ట్రం కులగణన చేపడుతోంది. బీహార్ తర్వాత.. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయి నుంచి సచివాలయాల ద్వారా డేటాను సేకరించి.. కులగణన చేపట్టనుంది ప్రభుత్వం. శుక్రవారం ప్రారంభం కానున్న ఈ భారీ కార్యక్రమం… దాదాపు 15రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం ఈ కులగణనలో ఐదున్నర కోట్ల జనాభా పాల్గొననుంది.
ఇక, ఇదే శుక్రవారం రోజున ఏపీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. దళితోద్ధారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని… విజయవాడలో ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి జగన్. ఒకే రోజు ఈ కీలక కార్యక్రమాలు జరుగనుండటంతో… ఏపీలో పొలిటికల్ ఈక్వెషన్స్.. క్యాస్ట్ బేస్డ్‌గా మారిపోవడం ఖాయమన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. దీనికితోడు, అధికార వైసీపీ వ్యూహాలు చూస్తుంటే.. ఇప్పుడిలాంటి చర్చే నడుస్తోంది. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్.. సోషల్ ఇంజినీరింగ్‌లో ఫుల్ బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కాపుల మద్దతు మిస్సవకుండా మంత్రాంగం నడుపుతున్న వైసీపీ… బీసీలను సంతృప్తి పరిచేలా కులగణనకు శ్రీకారం చుట్టింది. మరోవైపు దళితులను ఆకట్టుకునేలా.. ప్రపంచంలోనే అతిపెద్దదయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతోంది. సామాజిక సమీకరణాలను సెట్ చేసుకుంటూ ఎన్నికల వైపు దూసుకెళ్తోంది అధికార పార్టీ.
రూలింగ్ పార్టీ అగ్రెస్సివ్‌గా చేపట్టిన ఈ సోషల్ ఇంజినీరింగ్‌కు.. ప్రతిపక్ష పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జయహో బీసీ సభలతో హోరెత్తిస్తున్న టీడీపీ.. దళితులు సహా ఇతర నిమ్న వర్గాల కోసం, వైసీపీ వ్యూహాలకు ధీటుగా ఎలా సన్నద్ధమవుతుందన్నదీ కీలకంగా మారింది. ప్రతిపక్షాల రియాక్షన్ కూడా ఇదే స్థాయిలో ఉంటే మాత్రం.. ఏపీ రాజకీయాల్లో కులం కుంపట్లు మరింత రాజుకోవడం ఖాయం. సామాజిక సమీకరణల్లో వైసీపీ చూపిస్తున్న ఈ దూకుడు ఎలాంటి రాజకీయ మార్పులకు దారి తీస్తుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…