
స్వచ్ఛ రథం పేరుతో పొడి చెత్త ఇవ్వండి.. సరుకులను పొందండి.. అంటూ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏపీ పంచాయతీరాజ్ శాఖ. ఇందులో భాగంగానే పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి.. ప్రజల వద్ద ఉన్న పనికిరాని వస్తువులను తీసుకుంటూ.. దానికి బదులుగా వారి ఇంటికి కావాల్సిన వంటింటి సరుకులను ఇస్తారు. మీరిచ్చే వస్తువులను బట్టి దానికి సరిపడా డబ్బులు లెక్కించి.. ఆ డబ్బుతోనే నిత్యవసర సరుకులు ఇవ్వనున్నారు. వీటి కోసం ప్రత్యేకంగా వాహనాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఈ వాహనం ముందు భాగం స్వచ్ఛరథం పేరుతో ఉండి చెత్త సేకరించడానికి వీలుగానూ.. వెనక భాగం సరుకులు పెట్టుకునేందుకు అణువుగా సిద్ధం చేస్తున్నారు. అట్టపెట్టె నుంచి ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్, స్టీల్ సామాన్లు, చిరిగిపోయిన బస్తాలు, పేపర్లు ఇలా ఏదైనా సరే వీళ్లు తీసుకుంటారు. ఇప్పటికే దీన్ని పైలెట్ ప్రాజెక్టుగా గుంటూరులో ఈ నెల పదో తేదీన ప్రారంభించారు. ఇక ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో సైతం ఇది సిద్ధమవుతోంది.
విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడును దీని కోసం ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే వాహనాన్ని కూడా నెలవారీగా అద్దెకి తీసుకుని దాన్ని స్వచ్ఛరధాలుగా మార్పులు చేసి.. ఆగష్టు నాటికి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోజూ రెండు వార్డులు తిరిగేలా వారంలో రెండుసార్లు గ్రామస్తులు ఇళ్ల వద్దకు ఈ వెహికల్ వెళ్లేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇది విజయవంతం అయితే.. రోజూ ఉత్పత్తి అయ్యే వ్యర్ధాలు తగ్గే అవకాశం ఉంటుందని.. ఈ కార్యక్రమాన్ని క్రమంగా జిల్లాల వారీ.. అలాగే మిగతా అన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశం ఉందన్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..