Tv9 Reality Check – Durga Temple: ఏపీలో విగ్రహాల విధ్వంసం పాతమాట. మరి ఆ ఘటన నుంచి అధికార యంత్రాంగం పాఠాలు నేర్చిందా? ఆలయాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టిందా? అంత సీన్మానే లేదు. సేఫ్టీ అనే మాటను దేవుడికే వదిలేశారు. అవును.. ఆలయాల్లో రియాల్టీ చెక్ చేపట్టిన టీవీ9 కెమెరా కంటికి విస్తుపోయే వాస్తవాలు చిక్కాయి. కాగా, ఏపీలో విగ్రహాల విధ్వంసం ఘటనలు అప్పట్లో పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖ అప్రమత్తమై భద్రతకు పెద్దపీట వేస్తామని ప్రకటించింది. మరి నిజంగానే ఆలయాల్లో సెక్యూరిటి పెరిగిందా..? సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారా..? భక్తుల భద్రతకు ఎలాంటి చర్యలు చేపట్టారు? తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9 నిఘా టీమ్.
ముందుగా దుర్గమ్మ టెంపుల్‌కి వెళ్లింది టీవీ9 టీమ్. అంతకంటే ముందే సంచిలో ఎక్స్‌ప్లోజీవ్స్, 644 గ్రాములున్న పిస్టల్‌ను వెంట తీసుకెళ్లింది. సెక్యూరిటీ ఉన్నారు కానీ పెద్దగా పట్టించుకోలేదు. కుయ్ కుయ్ అని సైరన్ ఇస్తుందనుకున్న మెటల్ డిటెక్టర్ మౌనంగా ఉండిపోయింది. ఎక్కడా ఎలాంటి తనిఖీల్లేవ్. టీవీ9 ప్రతినిధి ఎంత కూల్‌గా వెళ్లాడో అంతే కూల్‌గా బయటికొచ్చేశారు. అదీ.. ఆలయాల్లో నిర్లక్ష్యానికి పరాకాష్ట. దుర్గగుడిలో సెక్యూరిటీపై ఎన్నో వివాదాలు ఉన్నాయి. భద్రతకు సంబంధించిన టెండర్ల దగ్గరి నుంచి వెండి విగ్రహాల దొంగతనం వరకు ప్రతీది కాంట్రవర్శీనే. సెక్యూరిటీ ఏజెన్సీపై చాలా విమర్శలు వచ్చినా ఆ సంస్థకే ఇప్పటికీ కాంట్రాక్ట్ అప్పగిస్తున్నారు. ఇప్పుడు టీవీ9 నిఘాలో మరోసారి ఆ ఏజెన్సీ నిర్వాకం బయటపడింది.
దుర్గగుడి నుంచి నేరుగా గుణదల మేరిమాత పుణ్యక్షేత్రానికి వెళ్లింది టీవీ9. అక్కడ కూడా సేమ్ సీన్. సెక్యురిటీ సిబ్బంది తమకేం పట్టనట్టుగానే వ్యవహరించింది. ప్లాస్టిక్ కవర్‌లో గన్ పెట్టుకుని వెళ్లినా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. గుణదల మేరిమాత పుణ్యక్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అలాంటి ప్రదేశంలో భద్రత డొల్ల స్పష్టంగా కనిపించింది.
మాచవరం హనుమాన్ దేవాలయంలోనూ అదే పరిస్థితి. అక్కడి సెక్యూరిటిది కూడా ప్రేక్షకపాత్రే. ఎవరు వస్తున్నారో.. ఏం వెంటపెట్టుకొస్తున్నారో గమనించే తీరిక వాళ్లకి లేనట్టు కనిపించింది. పిస్టల్ పట్టుకుని బ్యాగ్‌లో పెట్టుకుని గర్భగుడిలోకి వెళ్లినా ఎవరూ ఆపలేదు. ప్రధాన ఆలయాలకు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తిభావంతో పులకించిపోతున్నారు. కానీ పూలతో పాటు కత్తులు, పిస్టళ్లు తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా జరగరానిది జరిగితే పరిస్థితేంటి? ఎవరు బాధ్యత వహిస్తారు? భక్తకోటికి ఏం సమాధానం చెబుతారు?