గత కొన్ని నెలలుగా బస్ ఛార్జీలతోపాటు నిత్యవసర వస్తులైన పప్పులు, ఉప్పు, నూనెల ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. చాలీచాలని ఆదాయంలో బతుకు వెళ్లదీస్తోన్న సామాన్యుడి నెత్తిపై మరో పిడుగులాంటి వార్త వెలువడింది. ఇకపై పాల ధరలు కూడా చుక్కలు చూపనున్నాయి. విజయ పాలు లీటరుకు 2 రూపాయన చొప్పున పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రకటించింది. అరలీటరుకు రూపాయి చొప్పున పెరుగుతుంది. రైతుల పాల సేకరణ ధరలు, నిర్వహణ, రవాణా ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు తెలిపారు. పెరిగిన ధరలు మార్చి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు. చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, పాల పదార్థాల విక్రయ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని, నెలవారీ పాలకార్డు కొన్న వారికి మార్చి 9 తేదీ వరకు పాత ధరలే వర్తిస్తాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దీంతో అర లీటరు విజయ లోఫ్యాట్ (డీటీఎం) ధర రూ. 27, ఎకానమీ (టీఎం) రూ. 29, ప్రీమియం (స్టాండర్డ్) రూ. 31, స్పెషల్ (ఫుల్ క్రీమ్) రూ. 36, గోల్డ్ రూ. 37, టీ-మేట్ రూ. 34లకు పెరిగాయి. విజయ లోఫ్యాట్ (డీటీఎం) లీటర్ పాల ధర రూ.52ల నుంచి రూ.54కు పెరిగింది. విజయ ఎకానమీ (టీఎం) లీటర్ రూ.56ల నుంచి రూ.58 చేరింది. విజయ ప్రీమియం (స్టాండర్డ్) లీటర్ రూ.62, విజయ టోన్డ్ (క్రీమ్) పాలు లీటర్ ధర రూ.72, విజయ గోల్డ్ పాలు లీటర్ రూ.74కు, విజయ టీ-మేట్ లీటర్ రూ.68లకు పెరిగాయి. ఈ ఆరు రకాల ప్యాకెట్లకు మాత్రమే ఈ ధర వర్తిస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.