అధికారుల చర్యతో కేంద్రమంత్రి నిర్మలా అసహనం.. ఎందుకిలా చేశారంటూ..
భద్రతా నేపథ్యంలో నిర్మలా సీతారామన్ సాలూరు వస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు. అయితే సీతారామన్ జిల్లాకు ఎందుకు వస్తున్నారో స్థానిక అధికారులకు కూడా పూర్తి స్థాయి సమాచారం లేదు. దీంతో మంత్రి కోసం ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో పాచిపెంట..

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు చేదు అనుభవం ఎదురైంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పర్యటించిన సీతారామన్ అధికారుల ఓవరాక్షన్ తో అసంతృప్తికి గురయ్యారు. జనవరి 3 న పరకాల ప్రభాకర్ తల్లి కాళికాంబ అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు. దీంతో సాలూరులో జరిగిన కాళికాంబ పెద్దకర్మ కు నిర్మలా సీతారామన్ హాజరయ్యేందుకు వచ్చారు.
భద్రతా నేపథ్యంలో నిర్మలా సీతారామన్ సాలూరు వస్తున్నట్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు. అయితే సీతారామన్ జిల్లాకు ఎందుకు వస్తున్నారో స్థానిక అధికారులకు కూడా పూర్తి స్థాయి సమాచారం లేదు. దీంతో మంత్రి కోసం ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో పాచిపెంట మండలం పనుకువలస లో ప్రధానమంత్రి జంజత్ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ వస్తున్నట్లు స్థానికంగా తెలియజేశారు.
అంతేకాకుండా నిర్మలా సీతారామన్ మరిది సుధాకర్ ఇంటికి సీతారామన్ వచ్చేసరికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్‌పీతో పాటు జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడ పుష్పగుచ్ఛాలు పట్టుకొని వచ్చి ఆమెను కలిశారు. దీంతో అక్కడ జరుగుతున్న హడావుడితో పాటు జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ కార్యక్రమం గురించి తెలుసుకొని అధికారుల తీరు పై మండిపడ్డారు.
నా వ్యక్తిగత కార్యక్రమానికి వస్తే ఎందుకింత హడావుడి చేస్తున్నారు? నేను ఎలాంటి అధికారిక కార్యక్రమాన్ని పెట్టుకోలేదు కదా? ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? నా కార్యక్రమాల కోసం మీకు ఎవరు సమాచారం ఇచ్చారు.? అంటూ వారిని నిలదీశారు. దీంతో జరిగిన సమాచారలోపానికి ఖంగు తిని ఆమెకు సారీ చెప్పి వెనుదిరిగారు జిల్లా అధికారులు. ఇదే వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇదిలా ఉంటే.. నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ తండ్రి పరకాల శేషావతరం. ఈయన నరసాపురం నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రి గా కూడా పనిచేశారు. అయితే 1981లో శేషావతారం ఆకస్మిక మరణం చెందారు. దీంతో అప్పటి ఉప ఎన్నికల్లో ఆయన భార్య కాళికాంబ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. శేషావతారం, కాళికాంబలకు రాజకీయాల్లో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. వీరికి పరకాల ప్రభాకర్, పరకాల సుధాకర్ తో పాటు ఒక కుమార్తె ఉంది.
అయితే గత కొన్నేళ్ల క్రితం పరకాల ప్రభాకర్ సోదరుడు సుధాకర్ వ్యక్తిగత కారణాలతో పార్వతీపురం మన్యం జిల్లా సాలురుకు కుటుంబంతో వలస వచ్చాడు. అలా వచ్చిన సుధాకర్ తో పాటు ఆయన తల్లి కాళికాంబ కూడా సాలూరు వచ్చేశారు. ఏంతో నిరాబండరతతో ఉండే సుధాకర్ కుటుంబ నేపథ్యం స్థానికంగా ఎవరికి తెలియదు. పరకాల సుధాకర్ భార్య కూడా ప్రభుత్వ ఉద్యోగి. వీరి కుటుంబం స్థానికంగా ఉన్నప్పటికీ నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుటుంబంతో ఉన్న బంధుత్వంపై ఎవరికీ అంతగా అవగాహన లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




