ఉండి అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ ఎవరికి దక్కనుందనే విషయంపై నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. సీన్‌లోకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తనకు టికెట్ కన్‌ఫమ్ చేయలేదని రఘురామ అంటుంటే తనకు నో చెప్పలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అంటున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ తీరుతో గందరగోళం పీక్స్‌కు చేరింది.
పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ టికెట్ వ్యవహారం టీడీపీలో కాకరేపుతోంది. ఉండి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. అయితే తాజాగా పార్టీలో చేరిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ కన్‌ఫామ్ అయిందన్న వార్తలు.. నియోజకవర్గ టీడీపీలో కలకలం రేపాయి. ఎమ్మెల్యే రామరాజు వర్గం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ తరుణంలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతో భేటీ అయిన రామరాజు.. టికెట్ విషయంలో తనకు ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేదని తేల్చిచెప్పారు.
మరోవైపు పార్టీ ఎక్కడ చెబితే అక్కడ పోటీ చేస్తాను తప్ప తాను ఎలాంటి కండీషన్స్ పెట్టలేదన్నారు రఘు రామకృష్ణరాజు. ఉండి నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు చెప్పలేదని స్పష్టం చేశారు.ఇక ఉండి టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కేటాయించడాన్ని ఇప్పటికే వ్యతిరేకించారు స్థానిక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. తాను కచ్చితంగా పోటీలో ఉంటానని స్పష్టం చేసిన శివరామరాజు.. స్వతంత్ర అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఎన్నికలు జరిగే మే 13 సమీపిస్తున్న తరుణంలో ఇంకా టికెట్ల రచ్చ తేలకపోవడం టీడీపీ శ్రేణుల్లో గుబులు రేపుతోంది. టికెట్ల లొల్లి త్వరగా తేలకుంటే అసలుకే మోసం వచ్చే అవకాశముందని ఆందోళన చెందుతున్నారు నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..