ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలసలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, చిన్నారి మృతిచెందారు. చలి నివారణకు నిప్పుల కుంపటి పెట్టుకుని నిద్రపోవడం లేదా ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక నివేదికలో విషవాయువు వల్ల మరణాలు తేలినా, అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముగ్గురు ఆడపిల్లలు అనాథలయ్యారు, గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఎంత ఘోరం.. ఎంత ఘోరం..ఒకే ఇంట్లో ముగ్గురిని బలితీసుకున్న నిప్పుల కుంపటి!
Manyam District Family Dies

Edited By:

Updated on: Jan 24, 2026 | 9:40 AM

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, చిన్నారి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. వనజ గ్రామానికి చెందిన మీనక మధు సూదన్ (35) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. 16 సంవత్సరాల క్రితం బొమ్మిక గ్రామానికి చెందిన సత్యవతి (30)తో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. గురువారం సాయంత్రం వరకు భార్యాభర్తలు ఇంటి పెరటిలో కంచె ఏర్పాటు చేసుకుంటూ సాధారణంగానే గడిపారు. రాత్రి 10 గంటల వరకు బంధువులు, చుట్టుప్రక్కల వారితో కలసి గడిపారు. అనంతరం ఏజెన్సీ ప్రాంతం కావటంతో చలికి తట్టుకునేందుకు ఇంట్లో ఓ మూలన నిప్పుల కుంపటి పెట్టి నిద్రపోయారు. అయితే అలా పడుకున్న కుటుంబసభ్యులు మరుసటి రోజు పొద్దెక్కినా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన మధుసూదన్ సోదరుడు మధు ఫోన్ కి ఫోన్ చేశాడు. రింగ్ అవుతున్నా స్పందన లేకపోవడంతో ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా రెండు మంచాలపై దంపతులు, ఇద్దరు పిల్లలు కదలిక లేకుండా కనిపించారు.

భయభ్రాంతులకు గురైన బంధువులు, గ్రామస్తులు నలుగురిని చినమేరంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మీనక మధు, సత్యవతి, వారి కుమారుడు మోస్య (4) మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. తీవ్ర అస్వస్థతకు గురైన కుమార్తె ఆయేషాను విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే కుటుంబం మృతికి గల కారణాల పై స్థానికంగా అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇంట్లో గడియ పెట్టి పడుకున్న మధుసూదన్ దంపతులు పడుకున్న వారు పడుకున్నట్లు ఎలా చనిపోయారు? వీరిది ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదన్ కుటుంబ ఆర్థిక పరిస్థితి పై ఆరా తీస్తున్నారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తరువాత వచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఊపిరితిత్తుల నిండా విష వాయువు సోకినట్లు గుర్తించారు వైద్యులు. అయితే, ఊపిరితిత్తులకు సోకిన విషవాయువు నిప్పుల కుంపటి నుంచి వెలువడిన పొగ నా? లేక మరేమైనా జరిగిందా? అనేది సస్పెన్స్ గా మారింది. నిప్పుల కుంపటి నుంచి వచ్చిన పొగ కారణంగానే ఊపిరాడక మృతి చెందినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే కుటుంబసభ్యులు మాత్రం ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. పోలీసులు అనుమానిస్తున్నట్లు నిప్పుల కుంపటి నుంచి వచ్చిన పొగ వల్ల ప్రమాదం జరిగితే నలుగురు కుటుంబసభ్యుల్లో ఒకరైనా ఊపిరాడక నిద్ర మత్తు నుంచి బయటకు వచ్చి తలుపు తీసే ప్రయత్నం చేస్తారు కదా? అలా కాకుండా కుంపటి పొగ కారణంగా నిద్రలో ఉన్న వారు నిద్రలోనే ఎలా మరణిస్తారు..? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా వారికి నిత్యం నిప్పుల కుంపటి పెట్టుకొని పడుకునే అలవాటు ఉంటే అదే రోజు ఆ కుంపటి నుంచి వచ్చిన పొగతో ఎలా మరణించారు? అన్న చర్చ కూడా నడుస్తుంది.
లేకపోతే ఇటీవల కొన్న బైక్ ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక మృతుడు మధుసూదన్ ఏమైనా విష ప్రయోగం జరిపాడా? అన్న ప్రశ్నలు అందరిలో తలెత్తుతున్నాయి.

ఈ మృతి పై సమగ్ర దర్యాప్తు జరిపి పూర్తిస్థాయి విచారణ జరిపించాలని కోరుతున్నారు మృతుల బంధువులు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో వనజ గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. తల్లిదండ్రులు, తమ్ముడిని ఒకేసారి కోల్పోయిన మాధురి, మోక్ష కన్నీరుమున్నీరవుతున్నారు. చెల్లి ఆయేషా ప్రాణాలతో బయటపడాలని గ్రామస్తులు దేవుడిని వేడుకుంటున్నారు. ఈ విషాద ఘటనతో ముగ్గురు ఆడపిల్లలు అనాథలుగా మారడం హృదయాలను కలిచివేస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..