తిరుపతి జిల్లా, సెప్టెంబర్ 29: తిరుపతి జిల్లా అంతటా వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగరాలన్నారు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దక్షిణ కోస్తా జిల్లాల కో ఆర్డినేటర్ విజయ సాయి రెడ్డి. తిరుపతిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న విజయ సాయి రెడ్డి మరో మారు క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముందడుగు వేయాలని పార్టీ క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు
ఎంపీ విజయసాయిరెడ్డి. తిరుపతి జిల్లాలో 2019 ఎన్నికల లాగానే 2024 ఎన్నికల్లో 7 అసెంబ్లీ, తిరుపతి లోక్ సభ స్థానాన్ని కైవసం చేసుకోని పార్టీని గెలుపించుకోవాలన్నారు. రెండు రోజులపాటు తిరుపతి జిల్లాలో సమీక్షలు నిర్వహించనున్న విజయసాయి రెడ్డి ఇప్పటికే జిల్లా పరిధిలో ఎమ్మెల్యేలు,
ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలతో తాడేపల్లిలో విడివిడిగా సమావేశం అయ్యారు. ఈ రోజు శ్రీకాళహస్తి, వెంకటగిరి, తిరుపతి, గూడూరు శాసన సభ నియోజకవర్గాల పార్టీ సమీక్ష సమావేశాలను విడివిడి గా నిర్వహించారు. సమీక్షల్లో తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, వరప్రసాద్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం తో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ప్రధానంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆయన చర్చించారు. నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు, ద్వితీయ, తృతీయ స్థాయి నేతలకు ఎన్నికల కోసం ఎలా సిద్దం కావాలన్న దానిపై ఎంపీ విజయ సాయి రెడ్డి దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికల్లో జగన్ మరోసారి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పార్టీ నాయకులు పనిచేయాలన్నారు విజయ సాయి రెడ్డి.
ఎన్నికల సమయం దగ్గర పడుతుందని, అందరూ అందుకు సన్నద్ధం కావాలన్నారు.
అలాగే నాయకుల మధ్య భిన్నాభిప్రాయలు ఉంటే పక్కన పెట్టి పార్టీ ప్రయోజనాలు ముఖ్యంగా పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ధేశించారు. జగన్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు ద్వారా ప్రజలు ఆదాయ వ్యయాలు పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి అనేది స్పష్టంగా కనిపిస్తుందన్న విజయ సాయి రెడ్డి రాజకీయంగా అన్ని వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 88 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతి మహిళకు ఈ పథకాలు అందుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లు, ఆసుపత్రుల రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, తదితర రంగాల్లో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు పూర్తి స్థాయిలో ఫలితాలు ఇస్తున్నాయన్నారు విజయసాయి రెడ్డి.