తిరుపతిలో యాత్రికుల వసతి సమస్య పరిష్కారం కోసం టిటిడి చర్యలు చేపట్టింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న వసతి సముదాయాలకు అదనంగా సకల సదుపాయాలతో మరో రెండు భారీ వసతి సముదాయాలను నిర్మించబోతోంది. ఏకంగా రూ. 600 కోట్లను కేటాయించిన టిటిడి పాలకమండలి 20 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించేలా అధునాతన సౌకర్యాలతో వసతి గృహాలను అందుబాటులోకి తీసుకు రానుంది. అచ్యుతం, శ్రీపదం పేరుతో రెండు వసతి సముదాయాలను భక్తుల వసతి కోసం నిర్మించాలని భూమన అధ్యక్షతన జరిగిన కొత్త పాలక మండలి తొలి సమావేశమే ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల వెంకన్న దర్శన కోసం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజుకు పెరిగిపోతోంది. అందుకు తగ్గట్టుగానే తిరుపతిలో వసతి గృహాల సంఖ్య పెరుగుతోంది. అయితే భక్తుల వసతి సమస్య మాత్రం తీరడంలేదు. టీటీడీకి చెందిన శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం తోపాటు పద్మావతి అతిథి గృహం భక్తులకు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు రైల్వే స్టేషన్ వెనుక వైపు శ్రీ గోవిందరాజ స్వామి ఉచిత సత్రాలు, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ భక్తులకు అందుబాటులో ఉండగా పూర్తి స్థాయిలో భక్తుల అవసరాలకు తగ్గట్టుగా వసతి సమస్య పరిష్కారం కావడం లేదు. తిరుమల యాత్ర కోసం వచ్చిన భక్తులు టీటీడీకి చెందిన వసతి గృహాల్లో బస చేసేందుకు అవకాశం లేకపోవడంతో ప్రైవేట్ హోటల్స్, లాడ్జిలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. దీంతో తిరుమల వెంకన్న దర్శనం కోసం వస్తున్న భక్తులు వసతి విషయంలోనే నిలువు దోపిడికి గురి అవుతున్న పరిస్థితి తిరుపతిలో కనిపిస్తోంది. భక్తుల అవసరానికి తగ్గట్టుగా ప్రైవేట్ హోటల్స్, లాడ్జిల నిర్వాహకులు వ్యవహరిస్తుండడంతో వసతి సమస్య వెంకన్న భక్తులకు భారంగా మారిపోతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు రూ. 70 కోట్లతో తిరుచానూరు వద్ద భక్తుల కోసం కట్టిన పద్మావతి నిలయం కూడా కలెక్టరేట్ కు కేటాయించడంతో భక్తులకు వసతి సమస్య పై దృష్టి పెట్టిన టిటిడి తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో భక్తుల కోసం వసతి సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక ఉన్న సి గోవిందరాజస్వామి ఉచిత సత్రాలను తొలగించి వాటి స్థానంలో కొత్తగా వసతి సముదాయాలు నిర్మించాలని భావించింది. 1959 అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజ్ ప్రారంభించిన శ్రీ గోవిందరాజ స్వామి 2, 3 సత్రాలను తొలగించి అచ్యుతం, శ్రీపదం పేరుతో 20 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా వసతి సముదాయాలు నిర్మించాలని నిర్ణయించింది. టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా రెండోసారి బాద్యతలు చేపట్టాక తొలి సమావేశంలోనే ఈ కీలక నిర్ణయం తీసుకోగా ఇందుకు గానూ రూ. 600 కోట్ల ను కేటాయిస్తూ బోర్డు తీర్మానం కూడా చేసింది.
దాదాపు 65 ఏళ్ల పాటు తిరుమల వెంకన్న దర్శనం కోసం వచ్చిన భక్తుడికి ఉచితంగా వసతి సేవను అందించిన శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఒక్కో సముదాయంలో 165 గదులున్నాయి. రెండు సముదాయాల్లో 330 గదులుండగా ఒక సముదాయం ఉచితంగా మరో సముదాయంలో ఒక్కో గది రూ. 50 అద్దె చొప్పున టిటిడి భక్తులకు వసతి కోసం కేటాయిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తీర్థయాత్రకు వచ్చే భక్తులు ఇక్కడే బస చేసి తిరుమల వెంకన్నను దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యే భక్తులతో ఎప్పుడూ సందడిగా ఉండే శ్రీ గోవిందరాజస్వామి ఉచిత సత్రాలు త్వరలోనే ఈ రెండు వసతి సముదాయాలు కనుమరుగు కానుండగా రూ. 600 కోట్లతో అధునాతన వసతులతో తిరిగి టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.
మరిన్ని తిరుమల వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..