Viral Photo: ఈ ఫోటోలో ఏడుకొండలవాడి వేషంలో ఉన్నది ఓ ఏపీ ఎంపీ.. ఎవరో గుర్తించారా..?
నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే ఆ వ్యక్తి ఒక్కసారిగా అవతారపురుషుడిగా మారారు. సాక్షాత్తూ కలిగియుగదైవం వెంకటేశ్వరుడి అవతారంలో స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇంతకూ ఎవరాయన?
రాజకీయనేతలంటేనే ఊపిరిసల్పని పనితో బిజీగా ఉంటారు. నిత్యం పార్టీ మీటింగులు, ప్రజలతో మమేకమవుతూ కుటుంబాన్ని సైతం మరిచిపోతుంటారు. ఇంకొందరు నేతలు ప్రజలను ఆకట్టుకునేందుకు భిన్నవిధాలా ప్రయత్నిస్తారు. కొందరు డైలాగులతో అలరిస్తే.. మరికొందరు విభిన్న వేషధారణతో అలరిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే చిత్తూరు జిల్లా(Chittoor District) తిరుపతి(Tirupati)లో జరిగింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి తిరుమల శ్రీవారి అవతారమెత్తారు. వేంకటేశ్వరుడి వేషధారణలో చూపరులను అలరించారు. తిరుపతి తాతయ్యగుట్ట గంగమ్మ జాతరలో ఆయన సాక్షాత్తూ కలిగియుగ దైవం వేంకటేశ్వరుడి వేషధారణలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. శ్రీవారి వేషంలోనే వెళ్లి తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుని పూజలు చేశారు. స్వామి వేషధారణలో వచ్చిన ఎంపీతో సెల్ఫీలు దిగేందుకు స్థానికులు పోటీపడ్డారు. ఇంకొందరైతే ఏకంగా కొబ్బరికాయలు కొట్టి నమో వేంకటేశా అంటూ మొక్కుతూ తమ భక్తిని చాటుకున్నారు. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న ఎంపీ.. గంగమ్మ తల్లి కోరిన కోర్కెలు నెరవేరుస్తుందన్నారు. ఎంతోప్రాశస్త్యం ఉన్న గంగమ్మజాతరలో అమ్మవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీవారి వేషధారణలో ఉన్న తనను కొందరు గుర్తుపట్టలేకపోయారని తెలిపారు. ఆయనతోపాటు మరో నలుగురు వివిధ వేషధారణలతో అలరించారు.