తిరుమల గిరులు. అరుదైన వృక్ష సంపద ఎర్రచందనం విస్తారంగా ఉన్న కొండలు. అయితే ఇప్పుడు కొండ ఎక్కుతున్న పుష్పాల అలజడి తో విలువైన సంపద ఖాళీ అవుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ కు తిరుమలను అడ్డాగా మార్చేస్తున్న స్మగ్లర్లు తరచూ పట్టుబడుతున్నారు. తిరుమలకు సమీపంలోనే ఉన్న పార్వేట మండపం, పాప వినాశం, శ్రీవారి పాదాలు, శ్రీవారి మెట్టు, శిలాతోరణం, కుమారధార, పసుపు ధర, గోగర్భం లాంటి ప్రాంతాల నుంచి ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డు నుంచే యదేక్షాగా వాహనాల్లో తరలిస్తూ అడ్డంగా పట్టుబడుతున్నారు. పండుగలు, పర్వదినాల సమయంలో పోలీసులు, అటవీ శాఖ అధికారుల కళ్ళు గప్పి
ఎర్రచందనం వాహనాలలో కొండ దిగుతున్న స్మగ్లర్లు భక్తుల ముసుగులో దందా కొనసాగిస్తున్నారు
అడ్డంగా దొరికిపోతున్న స్మగ్లర్లు
తిరుమల కొండ ల్లోని ఎర్రచందనం చెట్లను కూలదోసి దుంగలను వాహనాల్లో రహస్యంగా అమర్చి తిరుమల నుంచి జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. శిలాతోరణం, గోగర్భం, పాపవినాశనం ప్రాంతాల్లో అటవీ శాఖ నిర్వహిస్తున్న తనిఖీల్లో దొరికిపోతున్న ఎర్రచందనం అక్రమ రవాణా వాహనాలు, నమోదవుతున్న కేసులు తిరుమల కొండల్లో పుష్ప సీన్స్ రిపీట్ అవుతున్నట్లు స్పష్టమవుతుంది. గత నెలలో
పాపవినాశనం వద్ద, ఈ నెల 2 న శిలాతోరణం వద్ద, తాజాగా గోగర్భం డ్యాం ప్రాంతంలో పట్టుబడ్డ ఎర్రచందనం వాహనాలు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్స్ మార్చి స్మగ్లింగ్ జరుగుతున్న విషయాన్ని స్పష్టం చేశాయి. వాహనాల్లో సీట్లను తొలగించి కింద ఎర్రచందనం దుంగలు అమర్చి తరలిస్తున్న స్మగ్లర్లు భక్తుల ముసుగులో రెడ్ శాండిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు.
గత నెల 19న కుమారధార పసుపు ధర ప్రాంతంలో 5 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న అటవీశాఖ అధికారులు తమిళనాడులోని సేలంకు చెందిన సతీష్, వెంకటేష్ అనే స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈనెల 2న శిలా తోరణం వద్ద కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను ఫారెస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. తమిళనాడులోని విల్లుపురంకు చెందిన రమేష్ గోవింద రాజన్‌లను అరెస్టు చేసిన ఫారెస్ట్ అధికారులు. కారుతో పాటు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం గోగర్భం డ్యాం వద్ద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్ గల కారును అటవీ శాఖ సీజ్ చేసింది. కారు సీట్ల కింద ఎర్రచందనం దుంగలను అమర్చి భక్తుల్లా కొండ దిగే ప్రయత్నం చేసిన స్మగ్లర్లు అటవీశాఖ అధికారుల తనిఖీలతో అడ్డంగా దొరకపోయారు. ఇలా భక్తుల ముసుగులో కొండెక్కి విలువైన ఎర్రచందనం దుంగలతో కొండ దిగుతూ పట్టుబడుతున్న స్మగ్లర్లు పుష్పలుగా కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందనం ఉన్న కొండను ఖాళీ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి