అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమల శ్రీవేంకటనాధుని దర్శించుకునేందుకు భక్తులు దేశవిదేశాలనుంచి తరలి వస్తారు. శ్రీమన్నారాయణుని కళ్లారా చూసి తరించాలని గంటలు తరబడి క్యూలైన్లలో నిలబడి శ్రీనివాసుని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం కార్తీక మాసం నడుస్తోంది. హరిహరులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ నెలలో శ్రీనివాసుని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. అలా శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఆ శ్రీమన్నారాయణుడి సన్నిధిలోనే కన్నుమూసాడు. శ్రీవారి దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదం కోసం లడ్డూ కౌంటర్ వద్ద క్యూ లైన్‌లో నిల్చున్న గుర్తు తెలియని భక్తుడు అస్వస్థతకు గురయ్యాడు. క్యూలైన్‌లో నిలుచున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి భక్తులు అక్కడి సిబ్బంది అశ్వనీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వ్యక్తి మృతికి గుండెపోటే కారణమని వైద్యులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కార్తీక మాసం సందర్భంగా ఏడుకొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడి దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో మారుమోగుతుంది. ఈరోజు ఉదయం పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో హిందీ ఇంప్లిమెంటేషన్ పార్లమెంటరీ కమిటీ, నంద్యాల ఎంపీ బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు వేదాశీర్వచనం అందించగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..