TTD Electrical Cars: ఇక, తిరుమల కొండపై ఎలక్ట్రిక్ కార్లు.. పర్యావరణ పరిరక్షణకు టీటీడీకి అరుదైన గుర్తింపు..!

|

Aug 30, 2021 | 7:03 AM

తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణకు పెద్దపీట వేస్తోంది టీటీడీ పాలకమండలి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వినియోగిస్తున్న డీజ‌ల్ కార్లకు బ‌దులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రవేశ‌పెట్టాల‌ని నిర్ణయించింది.

TTD Electrical Cars: ఇక, తిరుమల కొండపై ఎలక్ట్రిక్ కార్లు.. పర్యావరణ పరిరక్షణకు టీటీడీకి అరుదైన గుర్తింపు..!
Ttd Electrical Cars
Follow us on

Tirumala Tirupati Electrical Cars: తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణకు పెద్దపీట వేస్తోంది టీటీడీ పాలకమండలి. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వినియోగిస్తున్న డీజ‌ల్ కార్లకు బ‌దులు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రవేశ‌పెట్టాల‌ని నిర్ణయించింది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించనుంది.

పర్యావరణ పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ప్రారంభించింది. దశల వారీగా తిరుమలలో డీజీల్‌ వాహనాలను నిషేధించాలని ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని ఇప్పుడు కార్యరూపంలోకి తీసుకొచ్చింది టీటీడీ. ఇందులో భాగంగా ఎన‌ర్జీ ఎఫిషియెన్సీ స‌ర్వీస్ లిమిటెడ్ నుంచి 35 ఎల‌క్ట్రిక్ కార్లను అద్దె ప్రాతిపదికన తీసుకున్నారు. ఒక్కోకారుకు నెల‌కు 32వేల రూపాయలు చెల్లించ‌నుంది టీటీడీ. ఐదేళ్లు అద్దె చెల్లించిన త‌ర్వాత ఎల‌క్ట్రిక్ కార్లు టీటీడీ సొంతం కానున్నాయి. ప్రస్తుతానికి మొత్తం 35 కార్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో విధులు నిర్వర్తించే అధికారులకు వీటిని కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది.

బ్యాటరీ కార్లకు పెట్టే ఛార్జింగ్‌ను స్టేషన్‌ టీటీడీ ట్రాన్స్‌పోర్టు విభాగంలో ఏర్పాటు చేశామని రవాణా విభాగం అధికారి తెలిపారు. దశల వారీగా పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. వీటితో పాటూ ఘాట్ రోడ్డులో ఎలక్ట్రిక్ బస్సులను కూడా ప్రవేశపెట్టాలని పాలకమండలి భావిస్తోంది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. తిరుమలలో ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో ఎలక్ర్టిక్‌ వాహనాలు ప్రవేశపెట్టడం ప్రధానమైంది. ఈ కార్లకు పూర్తిగా ఛార్జింగ్ ఉంటే 120 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని అధికారులు తెలిపారు. ఏసీ చార్జర్ ద్వారా చార్జింగ్‌కు 6 గంటలు, డీసీ చార్జర్ ద్వారా చార్జింగ్‌కు 90 నిమిషాల సమయం పడుతుందన్నారు. కిలో మీటరుకు రెండు రూపాయలలోపు మాత్రమే ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

కాగా, ఎలక్ట్రిక్ వాహనాల వాడకంలో ప్రపంచంలోనే తొలి పుణ్యక్షేత్రంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి అరుదైన గుర్తింపు లభించనుంది. ఉద‌యం నుంచి రాత్రి వ‌ర‌కు తిరుపతి నుంచి తిరుమ‌లకు వంద‌లాది ఆర్టీసీ బ‌స్సులు ప్రయాణం చేస్తుంటాయి. డీజిల్ బ‌స్సుల కార‌ణంగా కొండ‌ల్లో కాలుష్యం పెరిగిపోతున్నది. దీంతో ఈ డీజిల్ బ‌స్సుల స్థానంలో ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రవేశ‌పెట్టాల‌ని చూస్తున్నది టీటీడీ. ఇప్పటికే కొన్ని బస్సులను ప్రయోగాత్మకంగా నడిపినట్టు తెలుస్తోంది.

Read Also….  RGV: 40 ఏళ్ల క్రితం ఇలాంటి అమ్మాయి కనిపించి ఉంటే.. నేను ఇప్పుడు ఇలా ఉండేవాడిని కాదు. ఆర్‌జీవీ వ్యాఖ్యలు.

Suryapet: సూర్యాపేట జిల్లాలో అమానుష ఘటన.. మహిళను వివస్త్రను చేసి, కారం చల్లి ఊరేగించిన తండావాసులు