తిరుపతిలో విషాదం.. ఇద్దరు యువకులను ఉపిరాడకుండా చేసిన సెల్‌ఫోన్..!
తిరుపతి శివజ్యోతి నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. బావిలో పడిపోయిన సెల్‌ఫోన్‌ను బయటకు తీయబోయి భీమరాజు, నరేష్ అనే ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి ఊపిరాడక మరణించారు. ఒడిశాకు చెందిన మృతులు లాండ్రీ షాపులో పనిచేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఒక మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తిరుపతి: తిరుపతి నగరంలోని శివజ్యోతి నగర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. బావిలో పడిపోయిన సెల్‌ఫోన్‌ను తీసేందుకు ప్రయత్నించిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
స్థానికులు సమాచారం ప్రకారం.. బావిలో సెల్‌ఫోన్ పడిపోవడంతో దాన్ని బయటకు తీసేందుకు భీమరాజు, నరేష్ అనే ఇద్దరు యువకులు బావిలోకి దిగారు. అయితే అనుకోకుండా వారు నీటిలో పడిపోయి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులు ఇద్దరూ ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు. తిరుపతిలోని ఓ లాండ్రీ షాపులో పనిచేస్తున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టిన ఫైర్ సిబ్బంది.. ఒక మృతదేహాన్ని బావి నుంచి బయటకు తీశారు. మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగించినట్లు సమాచారం. ఈ ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన్ కోసం బావిలోకి దిగిన ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో శివజ్యోతి నగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
