Video: అర్ధరాత్రి ఇంటిపక్కన పొదల్లోంచి అదోరకం శబ్ధాలు.. ఏంటని టార్స్ వేసి చూడగా..
టెంపుల్ సిటీ తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శేషాచలం అటవీ ప్రాంతం నుండి తరచూ జనావాసాల్లోకి వస్తున్న చిరుతలు స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గ్రాండ్ వరల్డ్, ఉపాధ్యాయ నగర్ వంటి కాలనీల్లో చిరుతల ఆనవాళ్లను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు జనాలకు కీలక సూచనలు చేశారు.

టెంపుల్ సిటీ తిరుపతి శివారు ప్రాంతాలను చిరుతల భయం వెంటాడుతోంది. శేషాచలం అటవీ ప్రాంతానికి చేరువలో ఉన్న కాలనీల్లోకి తరచూ వస్తున్న చిరుతలు స్థానికులను బెదరగొడుతున్నాయి. శేషాచలం కొండల నుంచి నుంచి బయటకు వస్తున్న చిరుతల సంచారం పెరిగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ మధ్యకాలంలో చిరుతలు విచ్చలవిడిగా కనిపిస్తుండడం, కాలనీలోకి రావడం ఏకంగా రోడ్లపై తిరగడం చూస్తే చిరుతలు ఏ సమయంలో ఎలాంటి హాని కలిగిస్తాయో తెలియని పరిస్థితి స్థానికుల్లో నెలకొంది.
అటవీ నుంచి యూనివర్సిటీ ప్రాంతంలోని పలు కాలనీల వైపు వస్తున్న చిరుతలు తరచూ స్థానికుల కంటపడుతూనే ఉన్నాయి. కొన్ని సార్లు ఏకంగా, వీధుల్లోని రోడ్లపైకి వచ్చి యదేశచ్చగా తిరుగుతున్నాయి. ఇటీవల కాలంలో గ్రాండ్ వరల్డ్, ఉపాధ్యాయ నగర్, మంగళం, బీటిఆర్ కాలనీ ప్రాంతాల్లో వీటి సంచారం బాగా పెరిగింది. అయితే చిరుతలు తరచూ వీధుల్లోకి రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చేలోపే అవి మెళ్లగా ప్రహారీ గోడలు దూసేకి అడవిలోకి జారుకుంటున్నాయి.
ఈ మధ్యనే గ్రాండ్ వరల్డ్ ప్రాంతంలో కనిపించిన చిరుత ఒక ఇంటి వద్ద తాగునీటి తొట్టి దాకా వచ్చింది. కొండను ఆనుకుని ఇంటి ప్లాట్ చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడ అంచున నక్కిన ఎవరూ లేరని గుర్తించి నీటి తొట్టి దాకా వచ్చి వెళ్ళింది. గతవారం గ్రాండ్ వరల్డ్ రోడ్డుపై దర్జాగా తిరిగిన చిరుత ఉపాధ్యాయ నగర్ ప్రాంతం లో సంచరించింది. చిరుతను గుర్తించిన స్థానికులు ఎటు వెళ్తుందో తెలుసుకునే ప్రయత్నంలో ఫాలో అయ్యారు. కొంత దూరం ముళ్లపొదల్లో నక్కి నక్కిన చిరుత ప్రహరీ గోడను దూకి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఇలా తరచూ అటవీ ప్రాంతంలో నుంచి చిరుతలు బయటకు వస్తూ సరిహద్దుల్లో ఉన్న నివాసాల చెంత సంచరిస్తుండంతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చిరుతలు, వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే జనాలకు అధికారులు కూడా కొన్ని సూచనలు చేశారు. ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే.. వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
