AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికి పెద్దలుగా వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.. తిరుపతి డబుల్ మర్డర్ వెనుక షాకింగ్ నిజాలు

Tirupati Double Murder: తిరుపతిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల వివాదం, రెండు కుటుంబాల మధ్య నెలకొన్న పాత గొడవలే ఈ హత్యలకు కారణమని పోలీసులు వెల్లడించారు. సునీల్, అతని తండ్రి, తమ్ముడిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన కత్తి, బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

పెళ్లికి పెద్దలుగా వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.. తిరుపతి డబుల్ మర్డర్ వెనుక షాకింగ్ నిజాలు
Tirupati Double Murder Case
Raju M P R
| Edited By: |

Updated on: Jul 11, 2026 | 11:20 AM

Share

టెంపుల్ సిటీని ఉలిక్కిపడేలా చేసిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. లక్ష్మీపురం సర్కిల్‌లోని శ్రీనివాస కళ్యాణం మండపాల వద్ద జరిగిన డబుల్ మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఒక పెళ్లికి పెద్ద మనుషులుగా వ్యవహరించిన మునిరత్నం, మణికంఠలు మరో పెళ్లి జరుగుతున్న పెళ్లి మండపం వద్ద హత్యకు గురయ్యారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు కేసు వివరాలు వెల్లడించారు. తిరుపతి జిల్లా లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవి మనోహరాచారి వెల్లడించిన వివరాల్లోకెళ్తే.. ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్‌ 2021లో పావనిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ తర్వాత కుటుంబంలో మనస్పర్థలు నెలకొన్నాయి. గొడవలు పెద్దది కావడంతో పది నెలల క్రితం భార్య పావనిని సునీల్ వదిలిపెట్టాడు. దీంతో పావని తల్లి సంపూర్ణమ్మ మధ్యవర్తుల ద్వారా పంచాయతీ పెట్టించింది. తరచూ జంగాలపల్లిలోని సునీల్ ఇంటికి వెళ్లి గొడవ పడింది.

ఈ నేపథ్యంలోనే రెండు కుటుంబాల మధ్య అగాధం మరింత పెరిగింది. కొన్ని నెలల క్రితం సునీల్ కుటుంబంపై దాడి జరగడంతో సునీల్ కుటుంబం గ్రామాన్ని వదిలి పెట్టాల్సి వచ్చింది. ఏర్పేడు పోలీస్ స్టేషన్‌లో కూడా కేసులు నమోదు కాగా, సునీల్ కుటుంబం జంగాలపల్లి ని వదిలి గంగాధర్ నెల్లూరుకు వలస వెళ్లిపోయింది. అక్కడే పనులు చేసుకుంటూ ఉన్న సునీల్ కుటుంబం తిరుపతిలో జరుగుతున్న ఒక పెళ్ళికి హాజరైంది. జంగాలపల్లికి చెందిన బంధువుల పెళ్లి తిరుపతిలోని శ్రీ పద్మావతి కళ్యాణ మండపంలో జరుగుతోందని ఆ పెళ్ళికి సునీల్ కుటుంబం హాజరవుతుందన్న సమాచారం సంపూర్ణమ్మకు తెలిసింది. దీంతో పెళ్లికి మధ్యవర్తులుగా ఉన్న మునిరత్నం యాదవ్ అతని స్నేహితుడు మణికంఠలను సంపూర్ణమ్మ పెళ్లికి హాజరైన సునీల్ వద్దకు పంపింది. సునీల్ కుటుంబంతో మధ్యవర్తులకు వాగ్వాదం చోటు చేసుకుంది. మునిరత్నం, మణికంఠ తోపాటు మరికొందరి వేధింపులను సునీల్ కుటుంబం భరించలేక పోయింది. సునీల్‌తో పాటు తండ్రి వాసుదేవయ్య, సునీల్ తమ్ముడు ఉపేంద్రలు కత్తితో విచక్షణ రహితంగా వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో మునిరత్నం యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్రంగా గాయపడిన మణికంఠ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు.

ఇలా 10 నెలలుగా భార్యను వదిలిపెట్టి దూరంగా ఉంటున్న సునీల్ ఫ్యామిలీ పెళ్లికి పెద్ద మనుషులుగా వ్యవహరించిన వారిని అంతమొందించారు. హత్య చేసి బైక్‌పై బెంగళూరుకు పారిపోతుండగా అరెస్టు చేసిన పోలీసులు.. బైక్, కత్తి రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇరు కుటుంబాల మధ్య గతంలో కేసులు, గొడవలు నేపథ్యంలోనే డబుల్ మర్డర్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. గొడవల కారణంగానే సునీల్ కుటుంబం గ్రామం విడిచి వెళ్ళిపోయిందన్న అడిషనల్ ఎస్పీ రవి మనోహర చారి.. భార్యాభర్తల వివాదంలో మునిరత్నం, మణికంఠలు పెద్దమనిషిగా వ్యవహరించి హత్యకు గురయ్యారన్నారు.

Follow Us