Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇది కదా కావాల్సింది..
విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కుల మెమోలను మరింత మన్నికగా మార్చే కీలక నిర్ణయం తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రత్యేక నాన్-టియరబుల్ టెక్నాలజీతో రూపొందించిన లాంగ్ మెమోలను అందించనుంది. ఇవి చిరిగిపోకుండా, నీటిలో తడిసినా దెబ్బతినకుండా ఉండేలా ప్రత్యేక సింథటిక్ షీట్‌పై డిజిటల్ ప్రింటింగ్‌తో తయారు చేస్తున్నారు.

విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా భద్రపెట్టుకునే ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు ఇకపై మరింత మన్నికగా ఉండనున్నాయి. వర్షాలు, వరదలు, నిర్లక్ష్యం వల్ల సర్టిఫికెట్లు దెబ్బతినే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కొత్త తరహా మెమోలను ప్రవేశపెడుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందించే లాంగ్ మెమోలు ప్రత్యేక నాన్-టియరబుల్ టెక్నాలజీతో తయారవుతున్నాయి. దీంతో అవి సులభంగా చిరిగిపోవు.. నీటిలో తడిసినా దెబ్బతినవు.
ఇప్పటి వరకు సాధారణ కాగితంపై ముద్రించే మార్కుల మెమోలను విద్యార్థులు ప్రత్యేకంగా లామినేషన్ చేయించుకునేవారు. అయినప్పటికీ కాలక్రమేణా అవి పాడయ్యే అవకాశం ఉండేది. కొత్తగా తీసుకొస్తున్న మెమోల్లో మాత్రం ఆ సమస్య ఉండదని బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక సింథటిక్ షీట్‌పై డిజిటల్ ప్రింటింగ్‌తో రూపొందిస్తున్న ఈ మెమోలు ఎక్కువ కాలం యథాతథంగా ఉండేలా డిజైన్ చేశారు.
గత కొన్నేళ్లుగా రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల సమయంలో వేలాది మంది విద్యార్థుల విద్యా ధ్రువపత్రాలు నీటిలో తడిసి ఉపయోగించలేని స్థితికి చేరుకున్నాయి. డూప్లికేట్ మెమోల కోసం బోర్డు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. అలాంటి ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు ఈ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.
ఈసారి మెమో రూపకల్పనలో మరో మార్పు కూడా చోటు చేసుకుంది. ఇంతకాలం బ్లాక్ అండ్ వైట్ ఫొటోతో ఇచ్చే మెమోలకు బదులుగా ఇకపై విద్యార్థుల కలర్ ఫొటోలను ముద్రించనున్నారు. దీంతో మెమోలకు మరింత విశ్వసనీయత పెరగడంతో పాటు నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రతి ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు. వీరిలో ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులయ్యే దాదాపు నాలుగు లక్షల మందికి ఈ కొత్త తరహా లాంగ్ మెమోలు అందనున్నాయి. గతంలో సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పంపిణీ చేసే మెమోలను ఈసారి ముందుగానే సిద్ధం చేసి, ఆగస్టు 15లోపు కళాశాలలకు చేరవేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో ఉన్నత విద్య ప్రవేశాల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.
టెక్నాలజీ వినియోగించి విద్యార్థుల విద్యా ధ్రువపత్రాలను మరింత భద్రంగా మార్చే దిశగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలో తొలి కీలక సంస్కరణగా భావిస్తున్నారు.
