దాదాపుగా అన్ని పరీక్షల ఫలితాలు, తిరిగి విద్యాసంస్థల ప్రారంభంతో భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. మునుపెన్నడూ లేనివిధంగా తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో స్వామి వారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి ఆదివారం ఒక్కరోజులోనే భక్తులు సమర్పించిన కానుకలు రికార్డు సృష్టించాయి. తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా రూ.6 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదివారం విరాళాల విలువ రూ.6.18 కోట్లుగా తేలింది. ఇప్పటిదాకా తిరుమల వెంకన్న హుండీకి ఒకరోజు అత్యధికంగా లభించిన ఆదాయం రూ.5.73 కోట్లు. ఈ హుండీ ఆదాయం 2012 ఏప్రిల్ 1న లభించింది.
ఇదిలా ఉంటే, శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో తిరుమల గిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనం కోసం భక్తులు 4 కిలోమీటర్ల పొడవు క్యూలో వేచి ఉండగా.. తిరుమలలోని వసతి కౌంటర్లలో కూడా ‘నో వేకెన్సీ’ బోర్డులు దర్శనమిచ్చాయి. అటు ఏపీలోనూ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగుస్తుండటంతో గత రెండు రోజులుగా యాత్రికుల రద్దీ పెరిగింది. దీంతో వసతి, ఇతర సౌకర్యాలు పరిమితికి మించి విస్తరించాయి. తిరుమలలోని అన్ని వసతి కౌంటర్ల వద్ద టీటీడీ అధికారులు ఉదయాన్నే ‘నో వేకెన్సీ’ బోర్డులను పెట్టారు. రద్దీ దృష్ట్యా టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి కేవలం ప్రోటోకాల్ వీఐపీలకే పరిమితం చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై జూలై 15 వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని టీటీడీ ప్రకటించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి