Proddatur Tippu Sultan Statue controversy: కడప జిల్లా ప్రొద్దుటూరు నివురుగప్పిన నిప్పులా మారింది. టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం వైసీపీ, బీజేపీల మధ్య వివాదాన్ని రేపుతోంది. స్వాతంత్య్ర సమరయోధుడుగా కీర్తిస్తూ పట్టణంలోని జిన్నా రోడ్డు సర్కిల్‌లో టిప్పుసుల్తాన్ సర్కిల్ ఏర్పాటు చేస్తుండడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనకు సిద్ధమవుతోంది కాషాయ దళం. దీనిపై బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు సైతం స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సోషల్ మీడియా వేదికగా సర్కారుకు హెచ్చరికలు జారీ చేశారు సోము.
పట్టణంలో కొందరు స్ధానికులు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి సాయంతో ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై ఏపీ భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే కర్నాటకలో టిప్పుసుల్తాన్ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్న కాషాయ నేతలు.. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహంపైనా మండిపడుతున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జిన్నా రోడ్డు, మైదుకూరు రోడ్డు కూడలిలో టిప్పు సుల్తాన్ సర్కిల్ ఏర్పాటు చేయాలని కొందరు ముస్లిం పెద్దలు భావించారు. చాలా కాలంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పట్టణంలో ఇటీవల కాలంలో వరుసగా దేశ నాయకుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 13న టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు. దీంతో అసలు వివాదం మొదలైంది. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఇతర హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఎమ్మెల్యే రాచమల్లు టిప్పుసుల్తాన్‌ను దేశ భక్తుడు, చారిత్రక పురుషుడు అంటూ కీర్తించడాన్ని ఖండిస్తోంది భారతీయ జనతా పార్టీ. టిప్పుసుల్తాన్ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేస్తానని చేసిన ప్రకటనపై మండిపడుతోంది ఆ పార్టీ. మరోవైపు టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు అంశం పదిహేనేళ్ల కల అంటున్నారు ముస్లింలు.
టిప్పుసుల్తాన్ హిందూ వ్యతిరేకి అని.. ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్‌ను స్వాతంత్ర్య సమరయోధుడిగా గుర్తిస్తూ విగ్రహం ఏర్పాటు చేయడమేంటని కాషాయ దళం మండిపడుతోంది. విగ్రహం ఏర్పాటు అంశాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగుతామంటోంది. టిప్పుసుల్తాన్ చరిత్రపై ఎక్కడైనా చర్చించేందుకు తాము సిద్ధమంటున్నారు బీజేపీ నేతలు.
ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.. భారతీయులను కాఫీరులుగా ముద్ర వేసి ఊచకోత కోసిన పరమ దుర్మార్గుడికి విగ్రహాం ఏర్పాటు చేయడం ఏంటని బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లే అని ఆయన విరుచుకుపడ్డారు. ప్రొద్దుటూరు మత సామరస్యానికి మారుపేరుగా ఉందని, ప్రశాంతంగా ఉన్న పట్టణంలో ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడవచ్చని దాని వల్ల పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఆయన అన్నారు. రాజ్యకాంక్ష, మత విద్వేషంతో భారతీయులను, మహిళలను అనేక మందిని అత్యంత క్రూరంగా హింసించిన చరిత్ర టిప్పుసుల్తానని వీర్రాజు విమర్శించారు. టిప్పుసుల్తాన్ క్రూరుడు కాబట్టే గతంలో ఎక్కడ విగ్రహాలు పెట్టలేదని వెల్లడించారు. దేశానికి ఎనలేని సేవ చేసిన మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త అబ్దుల్ కలాం కన్నా టిప్పుసుల్తాన్ గొప్పవాడు కాదని, టిప్పుసుల్తాన్ విగ్రహం స్థానంలో అబుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
అనూహ్యంగా తెరపైకి వచ్చిన టిప్పుసుల్తాన్ వ్యవహారం ప్రస్తుతం ప్రొద్దుటూరులో అలజడి సృష్టిస్తోంది. ఈ సెన్సిటివ్ ఇష్యూ ఎటు దారితీస్తుందోనని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇటు పోలీసులు సైతం ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.